పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటివరకు 11 పిటిషన్లు దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ  విరుద్ధంగా ఉందని రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని దెబ్బతీసేలా చట్టం ఉందనే వాదనలు వినిపిస్తున్నారు. ప్రజాప్రతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ మతం ప్రాతిపదికన బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని వివిధ పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

 

పౌరసత్వ సవరణ చట్టంపై టీఎంసీ భగ్గుమంటోంది. బిల్లును వ్యతిరేకించిన ఆ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శరణార్థుల పౌరసత్వంతో ముడిపడి ఉన్న అంశమైనందున త్వరగా పిటిషన్ విచారించాలని సర్వోన్నత ధర్మసనాన్ని ఆశ్రయించారు. పౌరసత్వం చట్టం సవరణపై ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

 

పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో ప్రజలు విద్యార్థి సంఘాలు రోడ్లపైకొచ్చి నిరసన గళాన్ని వినిపించాయి. ఆందోళనలు మిన్నంటడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. పౌరసత్వ సవరణ బిల్లు..,  1985 అస్సాం ఒప్పందానికి తూట్లు పొడిచేలా ఉందనే వాదన మొదటి నుంచీ వినిపిస్తోంది. వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లులో మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే అస్సాంలో రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉన్నట్లుగా ఇతర రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదు. అస్సాం సంస్కృతిని, అస్సాం రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును కేంద్రం తొక్కేస్తోందనే భావన వారిలో ఉంది. అక్రమవలసదారులు ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో ఉండేందుకు వీల్లేదని గట్టిగా చెబుతున్నారు. 

 

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్సభలో 311 మంది మద్దతుగా ఓటేయడంతో ఆమోదం లభించింది. అటు రాజ్య సభలో 120 మంది అనుకూలంగా ఓటు వేయడంతో గట్టెక్కింది. గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ దీనిపై ఆమోద ముద్ర వేయటంతో చట్టంగా మారింది. అయితే ఈ చట్టంపై అసోం, త్రిపుర, మేఘాలయలో తీవ్ర నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. 

 

మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం వల్ల జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. దేశంలో వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి కూడా తమకు అవగాహన ఉందన్నారు. మరోవైపు పౌరసత్వ సవరణ సెగల కారణంగా జపాన్ ప్రధాని షింజో అబే పర్యటన రద్దయింది.  షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 15 నుంచి 17వరకు జపాన్ ప్రధాని భారత్ లో పర్యటించాలి. అసోం రాజధానిలో గువాహటిలో ఈ నెల 15న ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో తో సమావేశం కావలసి ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ హోం మంత్రి అసద్ జమన్ ఖాన్, విదేశాంగ మంత్రి అబ్దుల్ మూమెన్ తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: