ఓవైపు లంచం అనే మాట వినపడకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. అధికారులు మాత్రం దానికి భిన్నంగా ఉంటున్నారు. సేవల కోసం వచ్చిన సామాన్యులను లంచాల కోసం పట్టి పీడిస్తున్నారు అధికారులు. దీంతో.. ప్రతిరోజు ఏసీబీకి చిక్కుతున్నారు అధికారులు. తెలంగాణలో ఒకే రోజు మూడు అవినీతి చేపలు ఏసీబీకి  దొరికాయంటే అర్ధం చేసుకోవచ్చు పరిస్థితి. 

 

తెలంగాణలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ముగ్గురు లంచగొండి అధికారులు. చిక్కిన అవినీతి చేపల్లో మొదటిది టి.ఎస్.పి.డి.సి.ఎల్ కు చెందిన సైబర్ సిటీ డి.ఇ ముత్యం వెంకట రమణ.. ఆయన పేరుకే ముత్యం చేసేవన్ని మురికిపనులే. పనికోసం తన వద్దకు రావాలంటే.. డబ్బులు చేతిలో ఉండాల్సిందే. మణికొండకు చెందిన మైలారపు శివకుమార్ రెడ్డి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా ఉండగా.. కొన్ని పనులకు ఎస్టిమేషన్ ఫైల్ తయారు చేయడం కోసం.. డీఈని కలిశాడు. అయితే దాని కోసం 25 వేల రూపాయల లంచం అడిగాడు. దీంతో కాంట్రాక్టర్‌ ఏసీబీని ఆశ్రయించాడు. అవినీతి నిరోధక శాఖ.. ముత్యం వెంకటరమణను రెడ్‌హ్యండ్‌గా పట్టుకుంది. ఆయన ఆస్తులపై సోదాలు చేసిన ఏసీబీ20 లక్షల 40 వేల నగదు, 60 తులాల బంగారంతో పాటు వెండి, ఖరీదైన ఎలక్ట్రిక్ వస్తువలను స్వాధీనం చేసుకున్నారు.

 

ముత్యాన్ని కడిగేపనిలో ఏసీబీ ఉండగానే అదే డిపార్ట్‌మెంట్‌లో డి.ఇ ప్రసాద రావు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం గ్రామానికి చెందిన బొల్లారం బాలనర్సింహా అనే కాంట్రాక్టర్‌ ఫైల్ మూవ్ చేసేందకు 40 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో.. అడ్డంగా బుక్కయ్యాడు. మూడో అవినీతి తిమింగలం రెవెన్యూ శాఖలో పట్టుపడింది. గోల్కొండలో  ఓ భూమి విషయమై.. వి.ఆర్.ఓను సంప్రదించాడు జాకీర్ అనే వ్యక్తి. అయితే వీఆర్ఓ  వెంకటయ్య అతనిని 6 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో.. అవినీతి వీఆర్ఓ గుట్టురట్టయింది. మొత్తం మీద.. ఒకే రోజు ముగ్గురు లంచావతారులు దొరకడం సంచలనంగా మారింది. ప్రజలు స్పందించి ఏసీబీకి సకాలంలో సమాచారమందిస్తే.. అవినీతి అధికారులు దొరికే అవకాశం ఉందంటున్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: