బీజేపీ నాయ‌కురాలు, మాజీమంత్రి డీకే అరుణ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మద్య నిషేధాన్ని కోరుతూ రెండు రోజుల పాటు ధర్నా నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో మద్య నిషేధం కోసం గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఇందిరాపార్కు వద్ద రెండ్రోజుల మహిళా సంకల్ప దీక్షను అరుణ చేపట్టారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాల్సిందేని డీకే అరుణ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. లిక్కర్‌ వల్లే రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయన్నారు. మద్యం ద్వారా వస్తున్న ఆదాయంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నడపడం సిగ్గు చేటని అరుణ‌ విమర్శించారు. రాష్ట్రంలో అనేక కుటుంబాలు మద్యం వల్ల ఆర్థికంగా చితికిపోయాయని, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు పెరుగుతుంటే సీఎంకు కనిపించడం లేదా అని నిలదీశారు. ఉద్యమం టైంలో మద్యంపై మహిళలకు ఇచ్చిన మాటను కేసీఆర్ మరిచిపోయారన్నారు. మద్యం వల్లే దిశ, మానస, సమతలు అత్యాచారానికి, హత్యకు గురయ్యారని ఆవేదన చెందారు. తాగొచ్చిన భర్తలను ఇంటికి రానివ్వమని మహిళలు సంకల్పం తీసుకోవాలని కోరారు. 

 

అయితే, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే డీకే అరుణపై మండిప‌డ్డారు. అరుణ‌ ఇల్లు దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లకు సంబంధించి మద్యం బాటిళ్లతో ఓ మ్యూజియాన్ని తలపిస్తుందని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 25 మద్యం షాపులు అరుణ కుటుంబ స‌భ్యుల‌కు ఉన్నాయని అన్నారు. అలాంటి డీకే అరుణ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మద్య నిషేధాన్ని కోరుతూ ధర్నా నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. 'అరుణమ్మా నీకు ఇది తగునా' అని ఆయనన్నారు. పుట్టినింట్లో నిజాలు నేర్చిన నీవు.. మెట్టినింట్లో అబద్ధాలు నేర్చావని దుయ్యబట్టారు. ముందు నీ ఇంట్లో ఉన్న మద్యం మ్యూజియాన్ని తొలగించాక తర్వాత రాష్ట్రం గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు.

 

కాగా, దీక్ష శిబిరాన్ని సందర్శించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌‌‌‌‌‌‌‌రావు అహంకారంతో రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్లకు అరుణ దీక్ష ఓ హెచ్చరికని అన్నారు. దీక్షతో ఏమవుతుందనే వారికి భవిష్యత్తులో బీజేపీ అంటే ఏంటో తెలిసొస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పు కోసం చేసే పోరాటాలకు బీజేపీ నాయకత్వం వహిస్తుందని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా పోరాడే వారిని కలుపుకుపోతుందని చెప్పారు. మద్య నిషేధం కోసం అరుణ చేస్తున్న పోరాటానికి బీజేపీ నేతలందరూ పూర్తి మద్దతు తెలుపుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో పోరాడే పార్టీలకే మద్దతు ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: