తెలుగురాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఆడ‌బిడ్డ ఉదంతంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకోనుంది దాదాపు 12 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దారుణంగా హ‌త్య‌కు గురైన‌ ఆయేషా మీరా మృతదేహానికి మరికాసేపట్లో రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో 27 డిసెంబరు 2007న హ‌త్య‌కు గురైంది.  ఈ కేసులో సత్యంబాబును నిందితుడిగా పేర్కొంటూ 11 ఆగస్టు 2008న పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే, ఈ కేసులో సత్యంబాబు పాత్రలేదని, మాజీ మంత్రి కోనేరు రంగారావు కుమారుడు, హాస్టల్ వార్డెన్, మరికొందరిపై ఆయేషా తల్లిదండ్రులు మొదట్నుంచి ఆరోపణలు చేస్తున్నారు. మ‌రోవైపు..కేసును విచారించిన విజయవాడ మహిళా సెషన్స్ ప్రత్యేక కోర్టు 2010లో సత్యంబాబుకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.అయితే, 2017లో హైకోర్టు స‌త్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది.

 

మ‌రోవైపు ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ 29 నవంబరు 2018న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ క్ర‌మంలో తాజాగా అయేషామీరా మృత‌దేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వ‌హిస్తున్నారు. ఇందుకోసం సీబీఐ అధికారులు, పోలీసులు తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికకు చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసమైనందున, తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాలుగా మారింది. 

 


ఇదిలాఉండ‌గా, ఏపీ ప్రభుత్వం మహిళల భద్రతకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకొని దిశ చ‌ట్టానికి ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే.కొత్త చట్టం ప్రకారం.. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, యాసిడ్ దాడుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి, కచ్చితమైన ఆధారాలుంటే 21 రోజుల్లోనే  ఉరి శిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. దీనిపై ఆయేషా త‌ల్లి స్పందిస్తూ..త‌న కూతురు కేసులోనూ నేరస్థులను పట్టుకుని, సీబీఐ ద్వారా శిక్ష వేయిస్తే చాలా గర్విస్తామని అన్నారు. ఆనాడు ఆయేషా మీరా కేసులో ఎందుకు 21 రోజుల్లో శిక్షవేయలేదని ఆమె నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: