జగన్మోహన్ రెడ్డి ఆరుమాసాల పరిపాలన బ్రహ్మాండంగా ఉందంటూ ప్రకటించి చంద్రబాబునాయుడుకే షాకిచ్చారు సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి.  ఆరుమాసాల పరిపాలనపై ఏ విధంగా విషం చిమ్మాలా ? బురదచల్లాలా ? అని ప్రతిరోజు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై జేసి నీళ్ళు చల్లినట్లైంది. అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన జేసి మీడియాతో మాట్లాడుతూ ఆరుమాసాల జగన్  పాలన బ్రహ్మాండంగా సాగుతోందన్నారు.

 

జగన్ ను  గట్స్ ఉన్న నేతగా అభివర్ణించారు. ప్రజలకు మంచి చేయాలని అనుకున్నపుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయకుండా చేసుకుపోవటమే జగన్ కున్న ప్లస్ పాయింట్లుగా జేసి వివరించారు. ఆరోగ్య శ్రీ పథకం అమలుపై జగన్ తీసుకున్న నిర్ణయానికి మాజీ ఎంపి హ్యాట్సాఫ్ చెప్పటం గమనార్హం.

 

జగన్ కనిపిస్తే అభినందించటానికి తాను వెనకాడనని కూడా చెప్పటం పార్టీలో సంచలనంగా మారింది.  ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఏమనుకున్నా డోంట్ కేర్ అంటూ తీసిపాడేశారు. అసెంబ్లీ లోపలేమో జగన్ పై విషం చిమ్మటానికి చంద్రబాబు అండ్ కో శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే అసెంబ్లీ బయట లాబీల్లో మాత్రం జగన్ పాలనకు టిడిపి నేతలు మద్దతుగా మాట్లాడటం కలకలం రేపుతోంది.

 

తన మనసులోని మాటను బయటకు చెప్పటానికి జేసి ఏనాడూ జంకింది లేదు. తప్పో ఒప్పో చెప్పదలచుకున్నది చెప్పేయటమే జేసి లక్షణం. ఈ లక్షణం వల్లే ఒకపుడు జగన్ పై నోటికొచ్చింది మాట్లాడి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టటం పెద్ద సంచలనంగా మారింది. తర్వాత చంద్రబాబు పాలనలోని లోపాలను, అనంతపురం జిల్లాలో మెజారిటి సీట్లు ఓడిపోతామని బహిరంగంగా చెప్పటం అప్పట్లో ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే.

 

తాజాగా జగన్ కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలపై పార్టీలో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జేసి కంట్రోల్ చేయలేక అలాగని స్వేచ్చగా వదిలేయలేక చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. కంట్రోల్ చేయటానికి ప్రయత్నించినపుడు జేసి ఎదురు తిరిగితే మొదటికే మోసం వస్తుందనే భయం, స్వేచ్చగా వదిలేస్తే ఇంకేమి మాట్లాడుతారో అనే టెన్షన్ తో చంద్రబాబు తలలు పట్టుకుంటున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: