పన్నెండు సంవత్సరాల క్రితం విజయవాడలో ఒక ప్రైవేట్ హాస్టల్లో అత్యంత దారుణంగా ఆయేషా మీరా అనే యువతిని హత్య చేశారు. 2018 లో హై కోర్టు ఈ కేసును సిబిఐ కి అప్పజెప్పింది. మళ్ళీ 12 సంవత్సరాల ఈరోజు ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఆయేషా మీరా హత్య గురించి మాట్లాడుతూ "నా బిడ్డ ఆయేషా మీరాను హత్య చేసినప్పుడు రోజా హడావుడి చేశారు, నాతో కలిసి తిరుగుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు, నా బిడ్డను ఎవరు చంపారో ఎమ్యెల్యే రోజాకు తెలుసు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న రోజా నా బిడ్డ హత్య కేసుపై స్పందించకపోవడం దారుణం" అని శంషాద్ బేగం వాపోయారు.

 

నిందితులు తమ పేరు చెప్తే మాపై కోటి రూపాయలు పరువు నష్టం దావా వేస్తామని బెదిరిస్తున్నారని శంషాద్ బేగం చెప్పారు. అక్కడ ఉన్న అమ్మాయిలు, హాస్టల్ వార్డెన్ కలిసి సీన్ ఆఫ్ అఫెన్సు లో ఉన్న సాక్షాధారాలను చెరిపేశారని శంషాద్ బేగం ఆరోపించారు. ఇక 2014 లో కోర్టు సిబ్బంది తమ కూతురు దుస్తులు తగులబెట్టి సాక్షాలు లేకుండా చేసారని, వారిని కోర్టు సస్పెండ్ చేసిందని అలా కాకుండా వారికి శిక్ష విధించాలని శంషాద్ బేగం డిమాండ్ చేశారు.

 

తన బిడ్డ హత్య కేసులో ఒక మాజీ మంత్రి మనవడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు ఆయేషా మీరా తల్లి. అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కావాలనే కేసును నీరుగార్చింది, ఇప్పటి ప్రభుత్వం అయినా తన బిడ్డ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు శంషాద్ బేగం. ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తరహాలో ఆయేషా మీరా చట్టం తీసుకురావాలని తద్వారా మరే తల్లికి గర్భశోఖం కలిగించొద్దని ప్రభుత్వాన్ని కోరారు ఆయేషా మీరా తల్లి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: