వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత సమస్య మొత్తం పోలీసుల మెడకు చుట్టుకుంది. హత్యాచారం ఘటన వెలుగు చూడగానే దేశం మొత్తం హోరెత్తిపోయింది. నిందితులను పట్టుకోవాలని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు పెరిగిపోయాయి. సరే నిందితులను పట్టుకోగానే వాళ్ళని కూడా వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని, వెంటనే ఉరి తీసేయాలని లేకపోతే వాళ్ళని తమకు అప్పగించాలంటూ జనాలు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసుల్లో టెన్షన్ పెంచేశారు.

 

సరే తెరవెనుక ఏమి జరిగిందో ఏమో. నిందితులను పట్టుకున్న పోలీసులు వాళ్ళని కోర్టుకు అలా అప్పగించి ఇలా విచారణ పేరుతో మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. అంతే మరుసటి రోజు ఉదయాన్నే నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ అయిపోయారు. ఎన్ కౌంటర్ జరిగిందని తెలియగానే యావత్ దేశమంతా ఒక్కసారిగా పోలీసులకు, కమీషనర్ విసి సజ్జనార్ కు బ్రహ్మరథం పట్టాయి.

 

దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలంతా ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తు పోలీసులకు శుభాకాంక్షలు చెప్పారు. అంతా బాగానే ఉందని అనుకున్నారు.  కానీ తర్వాత యాక్టివేట్ అయిన మానవహక్కులసంఘాల కారణంగా ఇపుడు పోలీసులు ఇరుక్కుపోయారు. ఒకవైపు మానవహక్కుల సంఘం విచారణ మరోవైపు సుప్రింకోర్టు విచారణతో పోలీసులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.

 

ముందు ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్లు చేసిన వాళ్ళు కానీ ఎన్ కౌంటర్ చేసిన తర్వాత అభినందించిన సెలబ్రిటీలు కానీ ఇపుడు పోలీసులకు మద్దతుగా నిలబడటం లేదు. నిందితులను ఎన్ కౌంటర్ చేయటమే సరైన న్యాయమని ఏ ఒక్క ప్రముఖుడు కూడా పోలీసులకు మద్దతు పలకటం లేదు.

 

మొన్నటి ఎన్ కౌంటర్ ఘటనను పోలీసులు గనుక టెక్నికల్ గా  సమర్ధించుకోలేకపోతే మొత్తం అందరూ కోర్టు బోనులో నిలబడాల్సిందే. వాళ్ళకు గనుక శిక్షలు పడితే మిగిలిన  పోలీసుల పరిస్ధితేంటి ?  అసలు ఎన్ కౌంటర్ కు ముందు పోలీసులపై ఒత్తిడి పెట్టిన మీడియా, సెలబ్రిటీలు ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: