ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తిట్ల పురాణానికి వేదికవుతోంది . వారు వీరు అన్న తేడాలేదు . అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు పోటీపడి మరి తిట్ల దండకాన్ని చదువుతున్నారు . ఒక వైపు గారు … అంటూ గౌరవిస్తూనే ,  మరొకవైపు గాడిద , దున్నపోతు , లుచ్చా , పందికొక్కు , ఒళ్ళు దగ్గర పెట్టుకో , తాటతీస్తాం , రేయి కూర్చోరా , నా కొడుకా అంటూ నోటికొచ్చినట్లు గౌరవ సభ్యులు మాట్లాడుతున్న తీరు చూసి  సామాన్య ప్రజలే విస్తుపోతున్నారు . సామాన్యులు సైతం ఉపయోగించని బజారు భాషను సభ్యులు అసెంబ్లీలో ఉపయోగిస్తుండడం చూసి , వీరేనా మన పాలకులంటూ ముక్కున వేలేసుకుంటున్నారు .

 

 అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా ఎమ్మెల్యేలు , మంత్రులు  మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరంగా ఉంటోంది . సన్నబియ్యం ఇస్తామని చెప్పి , ఇవ్వకుండా వైస్సార్ సర్కార్ మోసం చేస్తోంద న్న మాజీమంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలకు,   మంత్రి కొడాలినాని స్పందించినతీరు తీవ్ర విమర్శలకు దారితీసింది . ఎవరికి చెప్పాను ... నీ అమ్మ మొగుడికా అంటూ దేవినేని ఉమా ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి . అయినా సభ లో నాని తన దూకుడు మాత్రం తగ్గించుకోవడం లేదు . ప్రతిపక్ష సభ్యుడు అచ్చెన్నాయుడు ను వెటర్ని ఆసుపత్రి లో చేర్పించాలని వ్యాఖ్యానించడం ద్వారా పరోక్షంగా ఆయన్ని పశువుగా అభివర్ణించారు .

 

ఇక సభ బయట మార్షల్స్ నుద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలపాలవుతున్నాయి . రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు , అధికారులను పట్టుకుని బాస్టర్డ్ అని తిట్టిపోయడం పట్ల  వైస్సార్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ,  తక్షణమే క్షమాణాలు చెప్పాలని డిమాండ్ చేశారు . అయినా బాబు స్పందించలేదు అది వేరే విషయం అనుకోండి . ఇలా వారు , వీరు అన్న తేడాలేకుండా సభ్యసమాజం తలదించుకునే విధంగా సభ్యులు మాట్లాడుతున్న తీరు సభ ప్రతిష్టను మంటగలుపుతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: