పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అసోంలో గురువారం నాడు జరిగిన నిరసనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. నిరవధిక కర్ఫ్యూ సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు గోళాలను ఉపయోగించారు. 

 

అలాగే పోలీసులపై కూడా నిరసనకారులు రాళ్లు రువ్వడంతో గువహటి ఒక రణరంగాన్ని తలపించింది. శుక్రవారం సాయంత్రం కొంత ఉద్రిక్తతలు కాస్త శాంతించడంతో శనివారం ఉదయం కర్ఫ్యూను తాత్కాలికంగా తొలిగించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం తర్వాత అసోంలో నిరసనల వెల్లువెత్తిన విషయం అందరికి తెలిసిందే.

 

అయితే ఇదిలా ఉండగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలు తాజాగా సెగ విదేశీ పర్యాటకులను తాకింది. భారత్‌ కు వచ్చే తమ పౌరులకు అమెరికా, బ్రిటన్‌‌, కెనాడాలు ట్రావెల్‌ అడ్వైజరీని జారీ చేశాయి. భారత్‌ లోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వారు సూచించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌ లోని కొన్ని రాష్ట్రాలలో ఆందోళనలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురల్లో హింసాత్మక నిరసనలు చోటు చేసుకుంటున్నాయని బ్రిటన్ తన ట్రావెల్ అడ్వైజరీలో వెల్లడించింది.

 

అసోంలోని కొన్ని జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారని, రవాణాకు కూడా అంతరాయం జరుగుతుందని వివరించింది. ప్రయాణాలు అత్యవసరమైతే ఈశాన్య భారతానికి వెళ్లే బ్రిటన్‌ పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక మీడియా నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని, అధికారుల సూచనలు పాటించాలని చెబుతోంది. అమెరికా, కెనడాలు సైతం ఇలాంటి సూచనలే జారీ చేసింది. అంతేకాదు, తమ అధికారుల అసోం పర్యటనలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అమెరికా ఈ సందర్బంగా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: