హైద‌రాబాద్ వెట‌ర్నరీ డాక్ట‌ర్ దిశ హ‌త్యాచారం త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రు మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాలు, అకృత్యాల‌పై గొంతెత్తారు. ఢిల్లీలో ఏడేళ్ల క్రితం జ‌రిగిన నిర్భ‌య సంఘ‌ట‌న త‌ర్వాత మ‌ళ్లీ ఆ త‌ర‌హా ఉప్పెన దిశ విష‌యంలోనే వ‌చ్చింది. దిశ నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసే వ‌ర‌కు వాళ్ల‌ను చంపాల‌ని ప్ర‌తి ఒక్క‌రు గ‌ళ‌మెత్తారు. నిందితులు ఎన్‌కౌంట‌ర్ అయ్యాక పోలీసుల‌కు ప్ర‌తి ఒక్క‌రు జేజేలు ప‌లుకుతున్నారు.

 

ఇక ఇప్పుడు ఏపీలో విజ‌య‌వాడ‌లో ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జ‌రిగిన న‌ర్సింగ్ విద్యార్థిని అయేషా మీరా హ‌త్య కేసు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. అయేషా మీరా మృత‌దేహానిక రీ పోస్టుమార్టం చేయాల‌ని సీబీఐ అధికారులు నిర్ణ‌యించ‌డం నిజంగా ఆశ్చ‌ర్యానికి కార‌ణ‌మైంది. నాడు జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌పై అప్ప‌ట్లో తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నాడు ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు మ‌న‌వ‌డిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయేషా హ‌త్య కేసు కూడా ఓ ద‌శ దిశ లేకుండా సాగింది.

 

2007, డిసెంబర్ 27న అయేషా మీరా హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడైన సత్యం బాబును 2008, ఆగస్టు 11వ తేదీన అరెస్టు చేశారు. 2010లో సత్యం బాబుకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది విజయవాడ మహిళా సెషన్స్ ప్రత్యేక కోర్టు. 2017, మార్చి 31న సత్యంబాబు నిర్దోషిగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఎనిమిదేళ్లు జైలు జీవితం తర్వాత సత్యంబాబు విడుదలయ్యారు. 2018, నవంబర్ 29న సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. 2019, జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభించింది.

 

తెనాలికి చెందిన అయేషా మీరా విజ‌య‌వాడ‌లోని నిమ్రా కాలేజ్‌లో న‌ర్సింగ్ చ‌దువుతూ దుర్గ హాస్ట‌ల్లో ఉండేది. ఆమె కోర్సులో జాయిన్ అయిన మొద‌టి యేడాదిలోనే అత్యంత దారుణంగా హ‌త్య‌కు గురైంది. ముందుగా హాస్టల్ వంటమనిషిని విచారించిన పోలీసులు తర్వాత తెనాలికి చెందిన శివాంజనేయులు పై పలు పరీక్షలు చేసి ఇతనే నేరస్థుడని తెలిపారు. వారి కుటుంబీకులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయటంతో పోలీసులు అతనిని వదిలివేశారు.

 

ఆ త‌ర్వాత దొంగ‌త‌నం, మాన‌భంగం కేసులు ఎదుర్కొంటోన్న జ‌గిత్యాల‌కు చెందిన ఉపేంద‌ర్ సింఘ్ అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని అత‌డే నేరస్తుడ‌ని తేల్చారు. అత‌డి తల్లి కూడా మాన‌వ‌హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో అత‌డిని కూడా వ‌దిలేశారు. ఆ త‌ర్వాత గుర్విందర్ సింఘ్ ఆలియాస్ లడ్డు కాలి ముద్రలు ఘటనాస్థలంలో సేకరించినవాటికి స‌రిపోయాయ‌ని.. అత‌డిని అదుపులోకి తీసుకుని.. ఆ త‌ర్వాత అత‌డిని కూడా వ‌దిలేశారు. ఆ త‌ర్వాత అయేషా మీరా మేన‌మామ‌తో పాటు మ‌రో బంధువును ఈ కేసులో చేర్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

 

చివ‌రగా ప‌లు కేసుల్లో అప్ప‌టికే శిక్ష అనుభ‌విస్తోన్న నందిగామ‌కు చెందిన పిడతల సత్యనారాయణ ఆలియాస్ సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొంటూ ఆగష్టు 2008 న అతడిని మొదటిసారిగా అదుపులోకి తీసుకొనటం జరిగినది. పేద ద‌ళిత కుటుంబానికి చెందిన స‌త్యంబాబుకు త‌ల్లి - చెల్లి ఉన్నారు. అత‌డికి కొంద‌రు భారీగా డ‌బ్బులు ముట్ట‌చెప్పి త‌ప్పు ఒప్పుకునేలా చేశార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. మ‌ధ్య‌లో  ఓ సారి స‌త్యంబాబు పోలీసుల అదుపులోనుంచి త‌ప్పించుని.. తిరిగి దొరికాడు. ఇలా అయేషా మీరా హ‌త్య కేసులో స‌త్యం స‌మాధి అయ్యింది. నిందితులు బ‌య‌ట స్వేచ్ఛ‌గా తిరుగుతుంటే... అమాయ‌కుల‌ను బ‌లి చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

 

ఇక ఇప్పుడు సీబీఐ ఆమె మృత‌దేహానికి రీ పోస్టు మార్టం చేస్తుండ‌డంతో సీబీఐ అస‌లు నిందితుల‌ను శిక్షిస్తుందా ? ఈ రీ పోస్టుమార్టం ద్వారా ఏం చెప్పాల‌నుకుంటోంది ? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. శ‌నివారం ఉద‌య‌మే తెనాలిలోని చెంచుపేటలోని శ్మశాన వాటికలో అయేషా మీరా మృతదేహాన్ని వెలికితీశారు. సీబీఐ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మృతదేహం ఆనవాళ్లను కూలీలు బయటకు తీశారు. మృతదేహం ఆనవాళ్లను ఫోరెన్సిక్ నిపుణులు నమోదు చేసుకుంటున్నారు. ఎముకలు, కేశాలు, గోళ్లను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: