శబరిమలలో భద్రత ఇవ్వాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించాలనే అభ్యర్థనలకు సుప్రీం అంగీకరించలేదు. 2018లొ ఇచ్చిన తీర్పు విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదంటూనే,  ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించామని గుర్తు చేసింది. ఆలయంలోకి పోలీసులను పంపాలన్న ఆలోచన లేదని స్పష్టం చేసింది సుప్రీం కోర్ట్‌.

 

శబరిమల వెళ్లే మహిళల రక్షణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శబరిమల రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే తెలిపారు. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 

 

కొన్నాళ్లుగా శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే అనేకసార్లు ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శబరిమల వెళ్లి స్వామిని దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్న సంఘటనలు కూడా జరిగాయి. కాగా శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

 

ఫాతిమా, అమిని అనే మహిళలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం, రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తామని తెలిపింది. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే లేదని స్పష్టం చేసింది. గత తీర్పుపై స్టే లేకపోవడంతో మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతున్నామని ఈ పిటిషనర్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దాంతో, సీజేఐ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, తదుపరి విచారణ వరకు పిటిషనర్లకు పోలీసు భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశించింది. 

 

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా సరే వెళ్లి పూజల్లో పాల్గొనవచ్చని  2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు  తీర్పు ఇవ్వటంతో వివాదం మొదలయింది. ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసింది.  అయితే దీనిపై పలు రివ్యూ పిటిషన్ లు వచ్చాయి. దీంతో శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశం అంశాన్ని సుప్రీంకోర్టు ఇటీవల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: