పొట్ట‌చేత ప‌ట్టుకొని...ఎక్క‌డో త‌మిళ‌నాడు నుంచి హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చాడు. రియ‌ల్ ఎస్టేట్ త‌గాదాల్లో త‌న‌కు సంబంధం లేక‌పోయినా... శ‌వ‌మైపోయాడు. అలా క‌న్నుమూసింది ఓ సాదాసీదా వాచ్‌మెన్.  వారం రోజుల క్రితం బోయిన్‌పల్లిలో వాచ్‌మెన్‌పై పెట్రోల్ పోసి నిందితులు నిప్పు పెట్టారు. వివాదాస్పద స్థలానికి కాపలా ఉన్న వ్యక్తికి నిప్పంటించారు. గాయపడిన వాచ్‌మెన్‌ శరణప్ప  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

 


వాచ్‌మెన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారం రోజుల క్రితం బోయిన్‌పల్లిలో వాచ్‌మెన్‌పై పెట్రోల్ పోసి నిందితులు నిప్పు పెట్టారు. వివాదాస్పద స్థలానికి కాపలా ఉన్న వ్యక్తికి నిప్పంటించినట్లు నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాచ్‌మెన్ మృతి చెందాడు.

 


సికింద్రాబాద్ పాత బోయిన్‌పల్లి సర్వే నం.91లో శివ ఎన్‌క్లేవ్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో శ‌ర‌ణ‌ప్ప కాపలా ఉంటున్నాడు.  ప్రకాశ్‌ రెడ్డి, సంతోష్‌కుమార్‌ అనే వ్యక్తులకు చెందిన ప్లాట్‌లకు శ్రీనివాస్, శరణప్ప అనే వ్యక్తులు వాచ్‌మెన్లుగా పని చేస్తున్నారు. శ్రీనివాస్‌ అతని భార్య చిన్నలక్ష్మితో కలిసి వెంచర్‌లోని ఓ గదిలో నివాసముంటుండగా, శరణప్ప పగటి పూట మాత్రమే కాపలాకు వచ్చేవాడు. ఇలా వ‌చ్చిన స‌మ‌యంలోనే...వాచ్‌మన్‌పై ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఇందులో 40 శాతం గాయాలతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం క‌న్నుమూశాడు.

 

కాగా, సదరు స్థల యాజమాన్య విషయంలో ప్రకాశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌లకు టి. మాధవరెడ్డి, ఎస్‌. మాధవరెడ్డి మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో యజమానులు సదరు ప్లాట్‌ల చుట్టూ ప్రహరీ నిర్మించగా ఈ నెల 5న మాధవరెడ్డి వర్గీయులు కూల్చివేయించారు. దీనిని అడ్డుకున్నందుకు శ్రీనివాస్‌ అతని భార్య చిన్నలక్ష్మిలపై వారు దాడి చేయడంతో బాధితులు బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోలేదు. దాడితో భయాందోళనకు గురైన శ్రీనివాస్‌ తనకు అండగా ఉండేందుకు శరణప్పను రప్పించుకున్నాడు. మరుసటి రోజు రాత్రి నిందితులు ఎస్‌. మాధవరెడ్డి, టి. మాధవరెడ్డి శరణప్పపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన శరణప్పను  గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ భూవివాదానికి కారణమైన వ్య‌క్తుల సంతోషంగా ఉండ‌గా...అమాయ‌కుడైన శ‌రణ‌ప్ప క‌న్నుమూశాడ‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

వివాదాస్పద స్థలానికి కాపలా ఉన్న వ్యక్తికి నిప్పంటించి, ఆయన మృతికి కార‌ణ‌మైన ఈ ఉదంతంలో ఎస్‌.మాధవరెడ్డి, టి. మాధవరెడ్డిలతో పాటు మరో ఇద్ద‌రు పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసు సంచలనం కావడంతో ఎట్టకేలకు పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాల్‌ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: