హైదరాబాద్‌ మహానగరం గురించి చెబితే వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్, గోల్కోండ కోట. వంద కాదు... రెండు వందలు కాదు... ఏకంగా 500 ఏళ్ల ఘన చరిత్ర గోల్కొండ కోట సొంతం. మణి హారాల్లాంటి నందనవనాలు, శత్రుదుర్భేధ్య దర్వాజాలు, ఇటలీ, పార్శియన్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే కట్టడాలు గోల్కొండ కోట సొంతం.  ఆ కాలంలోనే టెక్నాలజీకి అంతు పట్టని విధంగా గోల్కోండ కోట నిర్మించారు.  బాలాహిస్సార్‌, చప్పట్ల ప్రాంగణం, శవస్నానశాల, రక్షకభట నిలయం, అక్కన్న మాదన్న కార్యాలయం, రామదాసు బందిఖానా.. ఇలా 120 మీటర్ల ఎత్తున్న కోటలో ప్రతిదీ ప్రత్యేకమే.హైదరాబాద్‌ నగరానికి 11 కి.మీ దూరంలో ఈ గోల్కోండ కోట ఉంది. ఈ ప్రాంతాన్ని క్రీ.శ 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించారు. దీని అసలు పేరు గొల్లకొండ. ఇక్కడ గొర్రెలు కాసుకునే కాపరికి ఆ కొండపై దేవతా విగ్రహం కనిపించిందట.

 

ఈ విషయాన్ని కాకతీయుల రాజులకు చెప్పగా ఇక్కడ మట్టితో ఒక కట్టడం నిర్మించారట. ఆ తర్వాత క్రమంలో ఇది గోల్కోండ కోటగా మారింది.  కాకతీయుల తర్వాత 1371లో గోల్కొండ కోట అజీం హుమాయూన్‌ వశమైంది. దీంతో ఈ కోట మహ్మదీయుల చేతిలోకి వెళ్లింది. తర్వాతి కాలంలో అనేకమంది రాజుల చేతులు మారి 15వ శతాబ్దంలో కుతుబ్‌ షాహీ రాజుల చేతుల్లోకి వెళ్లగా వారు ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే నల్లరాతి కోటను కట్టించారు.కుతుబ్‌ షాహీ వంశస్థులను ఔరంగజేబు జయించి ఈ కోటను కొంత భాగం వరకూ నాశనం చేశాడట. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత  పంద్రాగస్టు, రిపబ్లిక్‌ డే వేడుకలు కోట వేదికగానే నిర్వహిస్తున్నారు.

 

తాజాగా  గోల్కొండ కోట భూగర్భంలో మరో కోట ఉందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ గోల్ఫ్ కోర్స్ పక్కనే నయాఖిలలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధీనంలో ఉన్న దాదాపు 40 ఎకరాల భూమిలో గత పది రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం ఇక్కడ అనేక పురాతన వస్తువుల లభ్యమవుతున్నట్లు వారు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భంలో ఏదో ఒక కట్టడం ఉండవచ్చు అని ఏఎస్ఐ అధికారులు, చరిత్రకారులు భావిస్తున్నారు. తవ్వకాలలో 15వ శతాబ్దం నాటి శిథిలాలు బయటపడుతున్నాయని  అంటున్నారు.  కాగా, ఈ ప్రాంతాన్ని ఏఎస్ఐ దక్షిణాది రీజినల్ డైరెక్టర్ మహేశ్వరి పరిశీలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: