వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు బిగించుకోవడం ఇప్పుడు హై రిస్క్‌గా మారింది. నూతన వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకొని నెలలు గడుస్తున్నా.. నంబర్‌ ప్లేట్ మాత్రం అందడం లేదు. దీంతో.. ఆర్.టి.ఎ కార్యాలయాల చుట్టూ వాహనదారులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నిబంధనలతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు డీలర్లు. 

 

రూల్స్‌తో కొత్తగా వాహనాలు కొన్నవారికి చుక్కలు చూపిస్తున్నారు రవాణాశాఖ అధికారులు, వాహనాల డీలర్లు. వెహికల్స్ కొని నెలలు గడుస్తున్నా.. హై సెక్యురిటీ నెంబర్ రాకపోవడంతో.. టెంపరరీ నంబర్లతో భయం భయంగానే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు వాహనదారులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం హై సెక్యురిటీ బాధ్యతను షోరూం డీలర్లకే అప్పగించారు. అయితే కొన్ని ఫిర్యాదులు రావడంతో.. వాటిపై దృష్టి సారించారు ఆర్.టి.ఎ అధికారులు.

 

హైదరాబాద్ లో వాహనదారులు నంబర్‌ ప్లేటు బిగించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. దీనిపై ఖైరతాబాద్ ఆర్.టి.ఎ  కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం హై సెక్యురిటీ నంబర్ ప్లేటు కోసం ప్రత్యేకంగా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ హై సెక్యురిటీ నెంబర్ డీలర్ల చేతికి వెళ్లడం వల్ల దోపిడీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు వినియోగదారులు.

 

నెంబర్‌ ప్లేట్లపై వస్తున్న ఫిర్యాదులపై స్పందించింది ఆర్.టి.ఎ. వాహనదారులకు ఇబ్బందుల కలగకుండా చూడాలని డీలర్లను ఆదేశించామని జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాండురంగనాయక్ తెలిపారు. ఇబ్బందులపై వాహన డీలర్లు, రవాణాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించామని.. హైసెక్యూరిటీ ప్లేట్ల బిగింపు విషయంలో డీలర్లు నిర్లక్ష్యం వహిస్తే డీలర్ షిప్ కూడా రద్దు చేస్తామని హెచ్చిరించారు పాండు రంగనాయక్. వినియోగదారుల తీరు వల్లే నెంబర్‌ ప్లేట్ బిగించుకోవడం ఆలస్యమవుతోందనేది  డీలర్ల వాదన . వాహనం కొన్న తర్వాత నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకునేందుకు కొనుగోలుదారులు రావడం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నిబంధనలతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు డీలర్లు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: