అసెంబ్లీ మార్షల్స్‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే నిర్ణయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అసెంబ్లీ నాలుగో గేటు వద్ద గురువారం చీఫ్ మార్షల్‌తో సహా అసెంబ్లీ సిబ్బందిపై చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్, కొంతమంది టిడిపి నాయకులు  అసభ్యంగా ప్రవర్తించారని అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.

 

అధికార పార్టీ సభ్యులు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చంద్రబాబు నాయుడు నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగులను అవమానించారని సభకు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నాలుగవ గేట్ నుండి కాకుండా రెండవ గేట్ నుండి అసెంబ్లీలోకి ప్రవేశించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నిబంధనలను ఉల్లంఘించారని, ప్రజల దృష్టిని మళ్లించడానికి, సభ్యులను తప్పుదారి పట్టించడానికి మరియు అసెంబ్లీని దుర్వినియోగం చేయడానికి మాత్రమే ఉద్యోగులపై అభ్యంతరకర రీతిలో వ్యవహరించారని చెప్పారు.

 

అధికార పార్టీ సభ్యుల డిమాండ్లపై స్పందిస్తూ స్పీకర్ సీతారామ్ చంద్రబాబు నాయుడిని క్షమాపణలు కోరతారా లేదా ఘటనపై విచారం వ్యక్తం చేస్తారా అని అడిగారు. స్పీకర్ ప్రతిపాదించిన ఈ రెంటిని అంగీకరించడానికి చంద్రబాబు నాయుడు నిరాకరించడంతో, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, ప్రతిపక్ష నాయకుడిపై తీసుకోవలసిన చర్యలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

 

సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. క్రమశిక్షణా చర్యల కింద చంద్రబాబు నాయుడుని సభ నుంచి సస్పెండ్ చేస్తారని కొందరు నేతలు భావిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ చంద్రబాబును అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తే అసెంబ్లీలో అంతంతగా ఉన్న టీడీపీ పరిస్థితి మరింత ఇరుకున పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: