ఒక దీపం గది మొత్తం వెలుగునిచ్చినట్లుగా చదువుల దీపం కుటుంబం రూపురేఖల్ని మార్చేస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. పాఠశాల స్థాయి నుంచి సంస్కరణలు ప్రారంభించి చదివే ప్రతి కోర్సు విద్యార్థికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చదువుల దేవాలయమైన ఆంధ్ర విశ్వ విద్యాలయం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొదటి యూనివర్సిటీగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏయూ గర్వకారణమని, విశిష్ట మేధావుల్ని అందించిన ఈ విశ్వవిద్యాలయం దేశంలో 14వ స్థానంలో ఉండటం ఒకింత అసంతృప్తిని కలిగిస్తోందన్నారు. బోధనా సిబ్బంది ఖాళీలు 459 వరకు ఉన్నాయని వీసీ ప్రసాదరెడ్డి చెబుతున్నారని, ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కితేనే ఏయూని దేశంలో మొదటి 5 విశ్వ విద్యాలయాల్లో ఒకటిగా నిలబెట్టగలమన్నారు.

 

దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాన్ని పైకి తీసుకురావాలంటే ఆ కుటుంబంలో ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ లాంటి స్థానానికి చేరుకున్నప్పుడే అది సాధ్యమని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. ఇందుకు ఐఆర్‌ఎస్‌కి ఎంపికైన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఉదాహరణ అన్నారు. ఆయన ఏడో తరగతి వరకూ తెలుగు మీడియంలో, తర్వాత ఇంగ్లీష్‌ మీడియంలో చదివారని, ఆ అడుగు వెయ్యకుంటే ఐఆర్‌ఎస్‌ సాధించలేకపోయేవారన్నారు. 

 

పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు నాడు – నేడు కార్యక్రమాన్ని తీసుకువచ్చామని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బాత్‌రూమ్‌లు, బ్లాక్‌బోర్డులు, మంచినీరు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవని, నాడు–నేడు కార్యక్రమం ద్వారా తొలిదశలో రూ.3,600 కోట్లతో 15 వేల పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన అమలు చేస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: