హత్య జరిగి 12 ఏళ్లు పూర్తైంది. కోర్టులు మారాయి....దర్యాప్తు చేసే అధికారులు కొత్తవారొచ్చారు. అయినా.. కేసు కొలిక్కి రాలేదు. నిందితులెవరో తెలియలేదు. విచారణ పేరుతో హడావిడి చేశారు.  సత్యంబాబే నిందితుడని తేల్చారు. ఏడేళ్ల జైలుశిక్ష తర్వాత...అతడు నిర్ధోషిగా విడుదులయ్యాడు. దీంతో హైకోర్టు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఇప్పుడు రీ పోస్ట్ మార్టంతో సమాధి అయిన నిజాలను బయటకు తీసే పనిలో పడ్డారు అధికారులు. 


ఆయేషా మీరా హత్యకేసు మిస్టరీని ఛేదించేందుకు సిద్ధమైంది సీబీఐ. ఆయేషా మరణించిన 12 ఏళ్ల తర్వాత రీ పోస్టుమార్టం నిర్వహించింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయేషా మీరా మృతదేహాన్ని వెలికి తీశారు. ఐదు గంటల పాటు క్షుణ్నంగా పరిశీలించి ఆమె తల భాగాన్ని సేకరించారు.  న్యాయస్థానంలో దాఖలైన పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా చేసుకొని, గాయాలకు సంబంధించిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. రీ ఇన్వెస్టిగేషన్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.

 
రీ పోస్టుమార్టంపై ఆయేషా తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. 12 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన రోజా.... ఇప్పుడు సైలంట్‌ అయ్యారని ఆరోపించారు. రోజాకు అసలు నిందితులు ఎవరో తెలుసన్నారు. 2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఆయేషా మీరా దారుణహత్యకు గురైంది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును రెండేళ్ల కిందట హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. పోలీసులు సరిగా దర్యాప్తు చేయలేదని ఆయేషా తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఆరోపించాయి. దీంతో దోషులెవరో తేల్చాలంటూ హైకోర్టులో పిల్‌ కూడా దాఖలైంది. దీంతో  కేసును సీబీఐకి అప్పగించింది.

 

2019 జనవరి నుంచి కేసు దర్యాప్తు ప్రారంభించింది సీబీఐ. అందులో భాగంగా కేసులో తొలుత బెజవాడ పోలీసులు అరెస్టు చేసిన సత్యంబాబును విచారించింది. హత్య జరిగిన సమయంలో సత్యంబాబు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అనే విషయాలను ఆరా తీశారు. ఆ తర్వాత అయేషా తల్లి షంషద్ బేగం ఆరోపణలు చేసిన కొనేరు సతీష్ ను కూడా ప్రశ్నించారు. ఆయన ఇంట్లో కొన్ని హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయేషా మీరా కేసులో సాక్షాలను తారు మారు చేసేందుకు ప్రయత్నించారని సీబీఐ గుర్తించింది. దీంతో టెక్నికల్‌ విషయాలపై ఫోకస్ పెట్టింది. వైద్య నిపుణల సలహాలు తీసుకుంది. ముందుగా ఆయేషా తల్లిదండ్రుల నుంచి రక్త నమూనాలను సేకరించిన అధికారులు...డీఎన్‌ఏ పరీక్ష కోసం ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: