కేంద్ర కేబినెట్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరబోతుందా ?, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా ?? అంటే పొలిటికల్ సర్కిల్స్ లో అవుననే ఊహాగానాలు విన్పిస్తున్నాయి . గతంలోనూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ , కేంద్ర కేబినెట్ లో చేరడం ఖాయం అన్నటాక్ విన్పించిన విషయం తెల్సిందే  . అయితే అటువంటిదేమీ జరగలేదు. కానీ ఇప్పుడు మరోసారి కేంద్ర కేబినెట్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరనుందని , ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కి మంత్రి పదవి ఖాయమైందన్న గాసిప్స్ జోరందుకున్నాయి .

 

ఇటీవల హస్తిన లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇచ్చిన విందులోను ఇదే అంశంపై రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది .కేంద్రంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీ తో అధికారం లోకి వచ్చిన , ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయేందుకే ప్రయత్నిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు . దానికి కారణాలు లేకపోలేదు . ఎన్డీఏ నుంచి ఇటీవల శివసేన బయటకు వెళ్లిన విషయం తెల్సిందే . ఎన్డీఏ లో శివసేన స్థానాన్ని భర్తీ చేసేందుకు రాజ్యసభ లో బలమున్న ఒక ప్రాంతీయ పార్టీ అవసరం బీజేపీ కి ఉన్నదని , ఎలాగో వైస్సార్ కాంగ్రెస్ కు ఇద్దరు సభ్యుల బలం ఉన్న విషయం తెల్సిందేనని గుర్తు చేస్తున్నారు .

 

ఇక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం తో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సఖ్యతనే కోరుకుంటోంది . ఉభయ కుశలోపరి అన్నట్లుగా కేంద్ర కేబినెట్ లోకి వైస్సార్ కాంగ్రెస్ ను చేర్చుకుంటే  రేపు భవిష్యత్తు లో ఏదైనా అవసరం వస్తే ఆ పార్టీ అండ తమకు ఉంటుందని బీజేపీ భావిస్తుండగా , కేంద్రం తో సఖ్యత వల్ల రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టుకోవచ్చునని  వైస్సార్ కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: