ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా, జనసేనాని పవన్ కళ్యాణ్ మిత్రుడు, జనసేనలో కీలకంగా పనిచేసిన రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, అయన రాజీనామాను ఆమోదిస్తునట్టు జనసేన  పార్టీ ప్రకటించింది. జనసేన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజు రవితేజ... పార్టీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాం. ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నాం. గతంలో కూడా అయన ఇటువంటి బాధతోనే పార్టీని వీడి... తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయనకు మంచి భవిష్యత్తు, ఆయన కుటుంబానికి శుభం కలగచేయాలని ఆ జగన్మాతను ప్రార్తిస్తున్నానంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. 

కాగా, పార్టీ ఆవిర్భావం నుంచి పవన్‌కు అండగా ఉన్నారు రాజు రవితేజ. పవనిజం పుస్తకాన్ని కూడా రాశారు. కానీ, ఇప్పుడు జనసేనకు గుడ్‌బై చెప్పారు.. ఇదే సందర్భంలో పవన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ సంచలన ఆరోపణలు గుప్పించారు. తన రాజీనామా లేఖలో పవన్ తీరుపై తీవ్రమైన ఆరోపణలకు దిగారు రాజు రవితేజ. జనసేన అధినేత పవన్‌తో కానీ, జననేన పార్టీతో కానీ ఇకనుండి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఉండబోదని, అందరూ గమనించాలని తన లేఖలో కోరారు. 

పార్టీ మొదటి ప్రధాన కార్యదర్శి నేను.. ప్రస్తుతం నేను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిని... పవన్‌ కోరిక మేరకు నేను ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించినట్టు చెప్పుకొచ్చారు. ఇక, పవన్‌పై తీవ్ర ఆరోపణలే చేశారు రాజు రవితేజ... ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్‌లో మార్పు వచ్చిందని.. ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సొంత పార్టీ వాళ్లనే వ్యతిరేకిస్తున్నారన్నారు. పవన్ ఎవరి సలహాలు తీసుకోరని.. ఒకవేళ ఎవరైనా సలహాలు ఇస్తే.. అలాంటి నేతల్ని పక్కనపెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉండాలనే సూచనలు వస్తున్నాయని.. ఈ నిర్ణయాన్ని తాను సమర్థించలేనన్నారు. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్‌ కక్ష సాధింపు తనం మరియు కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: