జగన్ సర్కారు ఇటీవల ఓ ఐఆర్‌ఎస్ అధికారిని సస్పెండ్ చేసింది. పరిశ్రమ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా జాస్తి కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేశామని ప్రభుత్వం చెబుతోంది. తప్పు చేసిన అధికారులను సస్పెండ్‌ చేసి విచారణ జరపడం కొత్తేమీ కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. పత్రికల్లో మాత్రం ఆ అధికారిపై కక్ష సాధించారు అన్న తరహాలో కథనాలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఎల్లో మీడియాగా చెప్పుకునే పత్రికల్లోనే ఈ కథనాలు రావడం విశేషం.

 

ఐఆర్‌ఎస్‌ అధికారి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి మండలి మాజీ సీఈఓ జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ ను చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడలేని చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్‌ గురించి కక్షసాధింపు అని మాట్లాడారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. దీని ద్వారా ఆ అధికారికి, చంద్రబాబుకు ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

 

సహజంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వాలు సస్పెండ్‌ చేసి విచారణ జరుపుతాయి. ఇదేమీ ప్రభుత్వాలకు, అధికారులకు కొత్తేమీ కాదు. కానీ, ఇది చాలా పెద్ద సమస్యగా, రాష్ట్ర, జాతీయ సమస్యగా చంద్రబాబుకు అనుకూలమైన పత్రికలు అన్యాయంగా, అక్రమంగా సస్పెండ్‌ చేశారని పుంకాలుగా కథనాలు రాస్తున్నాయని వారు అంటున్నారు.

 

ఈ అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్నట్లుగా జాస్తి కృష్ణకిషోర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కాబట్టి గతంలో జగతి పబ్లికేషన్‌ కేసుల విచారణ టీమ్‌లో ఈయన సభ్యుడిగా ఉన్నాడని, జగతి పబ్లికేషన్‌ షేర్లు ప్రీమియం రేట్ల మీద వివాదం అయింది కాబట్టి దానిపై విచారణ జరిపి వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చాడని కక్షసాధింపు చర్యగా సస్పెండ్‌ చేశారని చంద్రబాబు చెబుతున్నారని అంబటి మండిపడ్డారు. జగతి పబ్లికేషన్‌ విచారణ టీమ్‌లో సభ్యుడిగా ఉండి బహుశా బాబుకు అనుకూలంగా ప్రవర్తించి అయినా ఉండాలి.. బాబుకు అప్పటి నుంచి టచ్‌లో ఉండొచ్చు. బాబు ఏం చెబితే అది చేసి ఉండొచ్చు. అలా చేశారు కాబట్టే ఆ అధికారిని రాష్ట్రానికి డిప్యూటేషన్‌ మీద తీసుకువచ్చారా..? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: