ఆయేషా మీరా అన్నెం పున్నెం ఎరుగని ఒక బీ-ఫార్మసీ విద్యార్థిని ని అతి కిరాతకంగా హత్య చేశారు. అది 2007వ సంవత్సరం, డిసెంబర్ 27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉలిక్కిపడింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయేషా మీరా విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో అత్యంత దారుణంగా హత్యకి గురైంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో ఉన్న ప్రభుత్వంపై మీడియా, ప్రజా, మహిళా సంఘాలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. హత్య జరిగి చాలా రోజులు గడుస్తున్నా హత్యకు కారకులైన వారు ఎవ్వరూ దొరకలేదు. 

 

అప్పట్లో విజయవాడ సీపీ దగ్గరకు ప్రతీ రోజూ మహిళా సంఘాలు రావడం సీపీకి ఆయేషా మీరా హత్య కేసులో నిందితులను పట్టుకోమని చెప్పడం, సీపీ పట్టుకుంటామని హామీ ఇవ్వడం రోజువారీ తంతులా మారింది. ఈ నేపథ్యంలో ఆయేషా మీరా హత్య కేసు గురించి సీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు, ఇక అదే సమయంలో సీపీ ఆఫీస్ కు ఎదురుగా ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్ లో అప్పటి రాష్ట్ర మంత్రి కోనేరు రంగారావు కూడా మరో విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇద్దరూ ఒకేసారి ప్రెస్ మీట్ నిర్వహించడంతో కొంత మంది మీడియా ప్రతినిధులు సీపీ దగ్గరకి వెళ్లగా మరికొంత మంది కోనేరు రంగారావు దగ్గరకి వెళ్లారు. 

 

ఆయేషా మీరా హత్య కేసు గురించి మాట్లాడుతూ "ఈ రాజకీయ నాయకుల ధర్నాలు, వాటి బందోబస్తుకే మా సమయం సరిపోతుంది, వీటి నుంచి మాకు కొంత ఉపశమనం ఇస్తే మేము కేసుపై దృష్టి సారిస్తాం, ఈ బందోబస్తు వల్ల మాపై ఒత్తిడి ఎక్కువగా ఉంది" అని ఆ పోలీస్ ఆఫీసర్ పేర్కొన్నారు. ప్రెస్ మీట్ ముగిసిన తరువాత మీడియా ప్రతినిధులు కోనేరు రంగారావు దగ్గరకి వెళ్లి మాట్లాడాల్సిందిగా కోరారు, అప్పటికే రంగారావు మాట్లాడడం పూర్తి అవ్వడంతో నేను మాట్లాడేసాను కావాలంటే మీరు ఏదైనా అడగండి చెప్తాను అంటూ పేర్కొన్నారు. 

 

ఆయేషా మీరా హత్య కేసుపై ఏం చెప్తారు అంటూ విలేకరులు ప్రశ్నించగా "ఈ హత్య కు పాల్పడిన వారు ఎంతటివారైనా ఉపేక్షించం నిందితులను కఠినంగా శిక్షిస్తాం" అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక రిపోర్టర్ సీపీ ప్రస్తావించిన విషయం పూర్తిగా చెప్పకుండా "సార్ పోలీసులపై రాజకీయ నాయకులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు అని అంటున్నారు" అని ప్రశ్నించగా కోనేరు రంగారావు "నేను చేసానా నా మనవడు చేశాడా" అంటూ వ్యంగ్యంగా స్పందించారు. 

 

ఇక ఆ తరువాతి రోజు కోనేరు వారి నోటి దురుసు అంటూ కొన్ని పత్రికలు రాశాయి. మహిళా సంఘాలు కోనేరు వెటకారపు మాటలపై మండిపడ్డాయి. ఇదే నేపథ్యంలో అసలు కోనేరు పేరు ఎందుకొచ్చింది అంటూ కొన్ని పత్రికలు రాయగా, ఆయేషా మీరా చనిపోయిన హాస్టల్ వారి ఇంటి పేరు కోనేరు కావడంతో వారికీ వీరికి ముడిపెట్టి కోనేరు సతీష్ కి ఈ హత్యకి సంబంధం ఉందంటూ రాసుకొచ్చారు. అసలు కోనేరు వారికీ హాస్టల్ వారికీ ఏ సంబంధం లేదు నిజానికి కోనేరు వారిది ఎస్సి సామజిక వర్గం కాగా హాస్టల్ యజమానిది వేరే సామజిక వర్గం. అసలు సంబంధం లేని కేసులో కోనేరు వారిని అనవసరంగా తెచ్చారని ఒక వర్గం వారి వాదన. ఇంతవరకూ మిస్టరీగా ఉన్న ఈ కేసును సిబిఐ ఎలా ఛేదిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: