తెలుగుదేశం పార్టీ అనుభంద విభాగాల్లో తెలుగు యువత అనేది చాలా కీలకం... ఆ విభాగం నుంచి వచ్చిన ఎందరో నేతలు పార్టీలో కీలక నేతలుగా, మంత్రులుగా పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే ఇప్పుడు ఆ విభాగం కష్టాల్లో ఉంది. ఎన్నికల సమయంలో ఒక ఆర్మీ కారణంగా ఆ విభాగాన్ని చంద్రబాబు పక్కన పెట్టారని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తెలుగు యువత ప్రాధాన్యతను బాగా తగ్గించారని, ఒక వ్యవస్థ పేరుతో ఆ అర్మీని పెంచి పోషించారని, వాళ్ళకే ఎక్కువ విలువ చంద్రబాబు ఇచ్చారు అనే అసహనాన్ని ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా వ్యక్తం చేసారు.

 

తెలుగు యువత అధ్యక్షుడిగా చరిష్మా ఉన్న దేవినేని అవినాష్ ని ఎంపిక చేసినా సరే చంద్రబాబు మాత్రం తగిన ప్రాధాన్యత ఆ విభాగానికి ఇవ్వలేదని అనే వారు. ఇప్పుడు ఆ పదవి నుంచి, ఆ పార్టీ నుంచి అవినాష్ బయటకు వచ్చేశారు. దీనితో ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్ లో ఒకరకమైన ఆందోళన నెలకొంది. పార్టీకి యువతను దగ్గర చేసిన ఘనత ఉన్న విభాగం అది. ఇప్పుడు నాయకుడు లేక ఇబ్బంది పడుతుంది. చంద్ర‌బాబు సైతం గ‌తంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఈ విభాగాన్ని వ‌దిలేశారు. ఎప్పుడో చివ‌ర్లో ఎన్నిక‌ల‌కు ముందు మాత్ర‌మే అవినాష్‌కు ఈ ప‌ద‌వి ఇచ్చారు.

 

అవినాష్ పార్టీ మారి నెల రోజులు అవుతున్నా సరే తెలుగు యువత విభాగానికి ఇప్పటి వరకు అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించలేదు. అసలు ఆ సామర్ధ్యం ఉన్న నాయకుడు ఎవరూ అనేది ఆ పార్టీలో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అవినాష్ ఉన్న సమయంలో ఆయన్ను పట్టించుకోకుండా నానా ఇబ్బందులు పెట్టి... ఇప్పుడు ఆ విభాగాన్ని పట్టించుకోకపోతే... అసలు భవిష్యత్తులో యువత పార్టీకి అందుబాటులో ఉంటారా అనే అనుమానాలను క్యాడర్ వ్యక్తం చేస్తుంది. ఎటు నుంచి ఎటు చూసినా సరే ఆ విభాగాన్ని మోసే నాయకుడే కనపడటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: