విద్యుత్ శాఖలో అడిషనల్ ఏఈగా పనిచేసి రిటైర్డ్ అయిన గోకుల్ శ్యాం సుందర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విజిలెన్సు విభాగానికి సమాచారం అందింది. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు నిరుద్యోగుల నుండి శ్యాం సుందర్ డబ్బు వసూలు చేస్తున్నట్లు తేలింది. దీంతో వీరు పోలీసులకు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శ్యాం సుందర్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేశారు.

 

గత నెలలో తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) నుండి 3025 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 15, 22 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఒక పక్క పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్న విద్యుత్‌శాఖ రిటైర్డ్ ఉద్యోగిని పోలీసులు 
అదుపులోకి తీసుకున్నారు. 
 

గోకుల్ శ్యాం సుందర్ విద్యుత్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాతపరీక్షలో మార్కులు వేయించి ఉద్యోగాలు వచ్చేటట్లు చేస్తానని చెప్పుకుంటూ.. ఉద్యోగార్థుల నుండి ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షలుగా వారితో భేరం కుదుర్చుకున్నాడు. ముందుగా లక్ష రూపాయలు.. నియామక ఉత్తర్వులు వచ్చాక మిగతా రెండు లక్షలు చెల్లించే విధంగా ఒప్పందం కుదర్చుకున్నాడు. ఉద్యోగం రాకపోతే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇస్తానని చెప్పేవాడు. అతడికి సంస్థ అధికారులతో ఎలాంటి సంబంధం లేదని.. ఎవరినీ సంప్రదించలేదని అధికారులు వెల్లడించారు. 

 
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న గోకుల్ శ్యాం సుందర్ లాంటి దళారులను నమ్మవద్దని.. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని సంస్థ చీఫ్ విజిలెన్సు ఆఫీసర్ శ్రీ కొండారి మురళీధర్ రావు గారు కోరారు. కష్టపడి చదివి అర్హత పరీక్షల్లో అర్హత సాధించిన వారు మాత్రమే ఉద్యోగాలు పొందుతారని.. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు ఇలాంటి దళారులను అశ్రయించినట్టు పరీక్షకు ముందే తెలిస్తే.. వారిని పరీక్షకు అనుమతించబోమని ఆయన హెచ్చరించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే.. 040-23431143 / 9440813884 / 9440812984 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: