అప్పులిచ్చి ఆస్తులు రాయించుకుని బాధితులను రోడ్డున పడేస్తున్న కాల్‌మనీ వ్యవహారం అప్పట్లో పెను దుమారం రేపింది.  కాల్‌నాగులు మ‌ళ్లీ కోరలు చాచాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా విషం చిమ్ముతున్నాయి. వారి అమాయకత్వాన్ని, అవసరాలను పెట్టుబడులుగా మలిచి కోట్లు కూడబెట్టుకున్నాయి.. వారంతా కష్టించి సంపాదించిన సొత్తును జలగల్లా పీల్చేస్తున్నాయి. అంతా సర్దుకుపోయింది అనుకున్న తరుణంలో ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదనే రీతిలో తమ సామ్రాజ్యాన్ని చాపకింద నీరులా విస్తరించాయి.  ఇప్పుడు మ‌రోసారి ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. 

 

అమరావతిలోని తాడేపల్లిలో కాల్‌మనీ వ్యాపారుల వేధింపులు తాళలేక.. మ‌రోవైపు కాల్‌మనీ వ్యవహారంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.  వివ‌రాల్లోకి వెళ్తే.. ఉండవల్లి వాసి వెంకట్రామయ్య అనే యువకుడు తాడేపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద ఒంటి మీద పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో తాడేపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద ఆదివారం కలకలం చోటుచేసుకుంది. 

 

గోపాలం సాంబశివరావు అనే వ్యక్తి అధిక వడ్డీల పేరుతో వేధిస్తున్నాడని, రూ.6 లక్షల అప్పు ఇచ్చి రూ.23 లక్షలు వడ్డీ కట్టించుకున్నారని వెంకట్రామయ్య ఆరోపించారు. కొద్దిరోజులుగా వడ్డీ వ్యాపారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆత్మహత్యకు యత్నించిన వెంకట‌ను పోలీసులు కాపాడి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాస్త‌వానికి కాల్‌మనీ వ్యవహారం అంతా సర్దుమనిగిపోయిందనుకు న్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాపారం చాపకింద నీరులా విస్తరించింది.

 

ఇటీవ‌ల  అమరావతి పరిధిలో ఇలాంటి వ్య‌వ‌హారాలు ఎక్కువ‌గా వెలుగు చూస్తున్నాయి. గతంలో కూడా గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వోద్యోగిని కాల్‌మనీ వ్యాపారులు వేధిస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి.. వారి వేధింపులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె చెప్ప‌డంతో అప్పుడు క‌ల‌క‌లం రేగింది. ఇక  ఆ ఘటన మరువకముందే అమరావతిలోనే మరో ఘటన జరగడం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: