టీఆర్‌ఎస్‌ పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇద్దరు నేతల పరిస్థితి ఇప్పుడు కనుమరుగయ్యే స్థాయికి చేరింది. ఈ ఇద్దరిలో ఒకరు తన పదవీకాలం ముగియడంతో ఎటువంటి హోదా లేకుండా సైలెంట్ గా ఉండగా మరొకరు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యత పొందిన మధుసూధనాచారి, స్వామి గౌడ్ కు ప్రస్తుతం సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకటం కూడా కష్టమవుతోందని తెలుస్తోంది. 
 
తెలంగాణ తొలి ప్రభుత్వంలో శాసనమండలిలో ఛైర్మన్ పీఠాన్ని స్వామి గౌడ్ కు అసెంబ్లీలో స్పీకర్ పదవిని మధుసూదనాచారికి ఇచ్చారు. మధుసూదనాచారి, స్వామి గౌడ్ ప్రాధాన్యత ఉన్న పదవుల్లో ఉండటంతో సీఎం కేసీఆర్ బలహీనవర్గాలకు పెద్దపీట వేశారన్న ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ ఇద్దరు నేతలు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మెప్పు పొందారు . కానీ ప్రస్తుతం ఇద్దరు నేతలు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గం నుండి 2014 సంవత్సరంలో గెలుపొందగా 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. స్థానికంగా పరిస్థితులు కలిసిరాకపోవటంతో ఓటమిపాలైన మధుసూదనాచారి ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో అవకాశం ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. టీఎన్జీవో నేతగా కీలక పాత్ర పోషించిన స్వామి గౌడ్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగి బంపర్ మెజారిటీ సాధించారు. 
 
పదవీ కాలం ముగియడంతో స్వామి గౌడ్ కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేసినా సానుకూల సంకేతాలు మాత్రం రాలేదని తెలుస్తోంది. మరోవైపు స్వామిగౌడ్ బీజేపీ పార్టీలో చేరతారని ప్రచారం జరిగటంతో స్వామిగౌడ్ కు కేసీఆర్ అపాయింట్ మెంట్ కు కూడా దొరకటం లేదని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో స్వామి గౌడ్ తో కలిసి పని చేసిన శ్రీనివాస్ గౌడ్ కు మాత్రం మంత్రి పదవి దక్కింది. సీఎం కేసీఆర్ సీనియర్ నేతలు స్వామిగౌడ్, మధుసూదనాచారిని కరుణిస్తారో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: