బీజేపీ అధిష్ఠానం పెద్ద‌ల ఆలోచ‌న‌పై రాష్ట్ర నేత‌లకు అంతు చిక్క‌డం లేద‌ట‌. కొత్త అధ్య‌క్షుడి ఉంటుంద‌ని కొత్త‌కాలంగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా... ఆశావ‌హుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న‌ట్ల ఆ పార్టీ వ‌ర్గాల్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌లో లాగా పైర‌వీల‌కు ఇక్క‌డ ఆస్కారం లేక‌పోవ‌డంతో అధిష్ఠానం నిర్ణ‌య‌మే శిరోధార్యం అనుకుంటున్నారంతా. ప్ర‌జా ఉద్య‌మాలు... ప్ర‌భుత్వంపై నిర‌స‌న గ‌ళం వినిపించి జ‌నాక‌ర్ష‌ణ త‌మ‌కు పుష్క‌లంగా ఉంద‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తూ అధిష్ఠానం దృష్టిలో ప‌డేందుకు విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

 

ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉంద‌ని భావిస్తున్న అధిష్ఠానం ఇప్ప‌టి నుంచే పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ఉధృతం చేస్తే ఎన్నిక‌లకు క‌నీసం సంవ‌త్స‌రం ముందు నుంచే బీజేపీ ప‌వ‌నాలు రాష్ట్రంలో వీస్తున్నాయ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో తీసుకురావాల‌ని, అలా అయితేనే స‌క్సెస్ రేటు ఎక్కువ‌గా ఉంటుంద‌న్న‌ది వ్యూహంగా క‌నిపిస్తోంది. మిగ‌తా రాష్ట్రాల్లో ప్ర‌యోగించిన హిందుత్వ ఫార్ములా అంతగా ప్ర‌భావం చూప‌ద‌ని కూడా జాతీయ నేత‌లు ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

 

ఇటీవ‌ల పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఆదిలా బాద్ లోక్‌స‌భ స్థానాల‌ను కైవసం చేసుకోవ‌డంతో అధిష్ఠానానికి ఇక్క‌డ పార్టీ బ‌లోపేతం అవుతుంద‌న్న న‌మ్మ‌కం కుదిరింది. అప్ప‌టి నుంచే వ‌చ్చే ఐదేళ్ల‌లో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా అమిత్‌షా ఢిల్లీ నుంచే వ్యూహాలు రూపొందించి రాష్ట్ర నేత‌ల చేత అమ‌లు ప‌రుస్తున్నారు. అయితే రాష్ట్ర నేత‌ల ప‌నితీరుపై ఆయ‌న అసంతృప్తి గా ఉన్న‌ట్లు గా స‌మాచారం. అందుకే అధ్య‌క్షుడి మార్పు ఆలోచ‌న చేస్తున్న‌ట్లుగా బీజేపీ శ్రేణుల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

 

ఇటీవ‌ల డీకే అరుణ ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత త్వ‌ర‌లోనే ఆమె అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న‌ట్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అర‌వింద్‌, బండి  సంజ‌య్ గ‌ట్టిపోటీ ఇస్తున్న‌ట్లు స‌మాచారం. బండి సంజ‌య్‌కు అనుహ్య రీతిలో ఫాలోయింగ్ పెరుగుతుండ‌టంతో ఇప్పుడు అధిష్ఠానం వ‌ద్దే ఆయ‌న పేరు బ‌లంగా వినిపిస్తున్న‌ట్లు స‌మాచారం.  పైగా క్లీన్‌చిట్ నాయ‌కుడు. యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. ఆర్ ఎస్ ఎస్ ప‌నిచేసిన అనుభ‌వం..ప‌క్కా హిందుత్వ భావ‌జాలం ఉన్న వ్య‌క్తి కావ‌డం ఆయ‌న‌కు ప్ల‌స్‌లుగా మారుతున్నాయ‌ని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

 

ఆర్టీసీ స‌మ్మెలో కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అని ఎదురొడ్డారు. పార్టీ ప‌రంగా మిగ‌తాచోట్ల కొంత వెనుక‌బ‌డ్డ క‌రీంన‌గ‌ర్ వేదిక‌గా పెద్ద ఉద్య‌మ‌మే బండి నిర్వ‌హించార‌న్న‌ది ఆపార్టీ నాయ‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతున్న అభిప్రాయం. అయితే  షార్ట్‌లిస్ట్ సిద్ధం చేసిన అమిత్‌షా తుది నిర్ణ‌యంపై స‌స్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. అమిత్‌షా మ‌న‌సులో ఏం ఉందో తెలియ‌క బీజేపీ శ్రేణులు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: