పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో జరుగుతోన్న విధ్వంసక చర్యలను ఖండించారు. మమతా బెనర్జీ ఎవరు విధ్వంసాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. శాంతి, ప్రజాస్వామ్యయుతంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన వ్యక్తం చేయాలని మమతా బెనర్జీ చెప్పారు. 
 
చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని మమతా బెనర్జీ అన్నారు. శనివారం రోజున మమతా బెనర్జీ విడుదల చేసిన ఒక ప్రకటనలో రహదారులను, రైల్వే లైన్ లను దిగ్భంధించి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు. ప్రభుత్వ ఆస్తులను నిరసన పేరుతో ధ్వంసం చేయవద్దని మమతా బెనర్జీ అన్నారు. హింసాత్మక ఘటనలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని మరియు దేశ వ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తామని చెబుతోన్న జాతీయ పౌర చట్టాన్ని అమలు కానీయమని మమతా బెనర్జీ అన్నారు. ప్రజల్లో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్ గురించి ఎవరూ గందరగోళం సృష్టించవద్దని మమతా బెనర్జీ కోరారు. పశ్చిమ బెంగాల్ లో పార్లమెంట్ ఆమోదం తెలిపిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఆందోళనకారులు చాలా చోట్ల విధ్వంసం సృష్టించటంతో మమత ప్రకటన విడుదల చేశారు. 
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోలేవని అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే చట్టం అమలయ్యే తొలి రాష్ట్రమని వ్యాఖ్యలు చేశారు. గతంలో మమతా బెనర్జీ ఆర్టికల్ 370, పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిందని కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటి అమలును ఆపలేదని అన్నారు. మమత పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించటానికి కారణం ఓటు బ్యాంకు పోతుందనే భయమా అని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: