అసెంబ్లీ మార్షల్స్ పై దాడి ఘటనలో చంద్రబాబు పప్పులో కాలేసారా?, అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. రెండు రోజుల క్రితం చంద్రబాబు తో సహా తన పుత్రరత్నం లోకేష్ ఇంకొంత మంది నాయకులు మూకుమ్మడిగా అసెంబ్లీ గేట్ వైపుగా రావడం వారిని అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకోవడం, లోకేష్ వారిపై విరుచుకుపడడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇక్కడే చంద్రబాబుపై అధికార వైసీపీ నేతలు ఒక అలిగేషన్ పెట్టారు. "అసెంబ్లీ చీఫ్ మార్షల్ ను పట్టుకొని చంద్రబాబు బాస్టర్డ్ అని తిట్టారని అసెంబ్లీలో వీడియో ప్లే చేసి మరీ చూపించారు"

 

అధికార పార్టీ సభ్యులు చీఫ్ మార్షల్ ను పట్టుకొని బాస్టర్డ్ అని తిట్టడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబుని జరిగిన ఘటనకి క్షమాపణ చెప్పాలని లేదా విచారం వ్యక్తం చేయాలని సూచించారు. దీనికి చంద్రబాబు తనను తిట్టిన వారు మొదట విచారం వ్యక్తం చేస్తే తానూ విచారం వ్యక్తం చేస్తానని చెప్పారు. ఇక్కడే చంద్రబాబు తన తప్పును పరోక్షంగా అంగీకరించారు. "వారు విచారం వ్యక్తం చేస్తే నేను చేస్తా అంటూ ప్రకటించడం ద్వారా పరోక్షంగా తాను బాస్టర్డ్ అని తిట్టానని ఒప్పుకున్నారు".

 

ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత వీడియోను పునఃపరిశీలించిన చంద్రబాబు తాను బాస్టర్డ్ అని అనలేదని 'నో క్వశ్చన్' అనే మాటను అధికార పార్టీ సభ్యులు వక్రీకరించారని పేర్కొన్నారు. "అసెంబ్లీలో పరోక్షంగా తప్పు ఒప్పుకున్న బాబు కోపంలో తాను నిజంగానే బాస్టర్డ్ అని అన్నానేమో అని అనుకున్నారట", సరిగ్గా ఇదే కథనం చంద్రబాబుకి అనుకూలంగా వుండే ఒక పత్రిక ప్రచురించింది. అంటే కోపంలో ఈ తిట్లు చంద్రబాబుకి సర్వసాధారణమేనా అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసలు ఆ మాట (బాస్టర్డ్) అనని చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు ఒప్పుకున్నారు, విచారం వ్యక్తం చేస్తానని ఎందుకు అన్నారు ఇక్కడే బాబు పప్పులో కాలేశారంటూ టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో తను చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: