జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదా.. ఇదీ ఎప్పుడూ వివాద అంశమే. స్వాతంత్ర్య కాలం నాటి నుంచి ఇప్పటివరకు ఈ అంశంపై ఎప్పుడూ రగడే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న ఆర్టికల్ 370ను రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే తిరిగి 370 ఆర్టికల్ ద్వారా ప్రత్యేక హోదా కల్పించనుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దాంతో మళ్లీ జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నారా అంటూ నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ.. అదంతా ఉత్త ప్రచారమేనని కొట్టిపారేశారు.

 

ఇదిలావుంటే.. ఆర్టికల్ 370, ఆర్టికల్ 371 మధ్య ఏలాంటి సంబంధంలేదని, రాష్ట్రంలోని సంస్కృతీ సంప్రదాయాలను రక్షించడమే ప్రధాన ఉద్దేశమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని కాంగ్రెస్, ఎన్సీపీలు తమ స్వార్థం కోసం వినియోగించుకున్నాయనే తప్ప.. ప్రజల క్షేమాన్ని, మనోభావాలను ఎన్నడూ పట్టించుకోలేదని చెప్పారు. ఆ ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ఆ పార్టీలు మింగుపడడం లేదని, అందుకే తప్పడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతేకాదు, కేంద్రపాలిత ప్రాంతంలో పదిహేనేళ్లు నివాసం ఉన్నవారిని స్థానికులుగా గుర్తించాలనే ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

 

ఒక్కసారి రద్దు చేసిన ఆర్టికల్ 370పై మరోసారి సమీక్ష అనేది ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో భూ యాజమాన్యం, హక్కుల విషయంలో స్థానికత అంశం ముఖ్యమైంది. సివిల్ సర్వీసెస్, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలలోనూ దీనికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో నివాస విధానం గురించి త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనున్నారని తెలిపాయి. నివాస ధ్రువీకరణ గురించి విధివిధానాల్లో స్పష్టం పేర్కొంటారని వెల్లడించాయి.

 

జమ్మూ కాశ్మీర్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పరిశ్రమలు, కొత్త వాణిజ్య సంస్థలను ఇక్కడికి తీసుకురావాలనే తలంపుతో కేంద్రం ఉంది. అందులో భాగంగానే  భూ యాజమాన్య హక్కులు కల్పించడం వల్లే పరిశ్రమలు, వ్యాపార సంస్థలను ఏర్పాటుచేయడమే కాదు అనుబంధ విభాగాల అభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ పరిశ్రమలు స్థాపించేవారికి, వ్యాపారులకు భూ యాజమాన్య హక్కుల నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: