నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై పసుపు రైతులు భగ్గుమంటున్నారు . ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పిన అర్వింద్ ఇప్పుడు మాట మార్చడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పసుపు బోర్డు ఏర్పాటు కన్నా , పసుపు  రైతుల సమస్యల  శాశ్వత  పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని అర్వింద్ ఆదివారం మీడియా తో మాట్లాడుతూ  చెప్పుకొచ్చారు. అర్వింద్ మీడియా తో మాట్లాడిన కాసేపటికే పసుపు రైతు సంఘం నాయకులు మీడియా ముందుకు వచ్చి అర్వింద్ తీరు పై నిప్పులు చెరిగారు . ఎంపీ గా గెల్చిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని చెప్పి, ఇప్పుడు మాట మార్చడం ఏమిటని ప్రశ్నించారు .

 

ఎన్నికల ముందు ఐదు రోజుల్లోనే బోర్డు ఏర్పాటు చేయిస్తానని చెప్పి , రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఇప్పుడు బోర్డు ఏర్పాటు కంటే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని  మండిపడుతున్నారు . పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతుల పక్షాన పోరాడుతానని చెప్పిన అర్వింద్ , తక్షణమే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి పసుపు బోర్డు ఏర్పాటు కోసం  పోరాడాలని డిమాండ్ చేస్తున్నారు . పసుపు బోర్డు తెస్తామని హామీ ఇవ్వడం వల్లే అర్వింద్ ను గెలిపించామన్న రైతులు , అర్వింద్ ను చూసి తాము ఓటెయ్యలేదని చెప్పుకొచ్చారు .

 

నిజామాబాద్ ప్రాంతం లో పసుపు రైతులు అధికంగా ఉండడం తో , ఈ ప్రాంతం లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు ఎన్నో ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని  కోరుతున్నారు . నిజామాబాద్ ఎంపీగా గతం లో ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత , బోర్డు ఏర్పాటు లో విఫలమైందని భావించిన స్థానిక రైతాంగం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన అర్వింద్ ను గెలిపించారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: