పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు  ఢిల్లీని తాకాయి . నిన్న , మొన్నటి వరకు ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసిన పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు , ఇప్పుడు ఢిల్లీ ని తాకడం ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీలు జులిపించడం వల్లే , ఆందోళనకారులు రెచ్చిపోయి , ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కు చెందిన మూడు బస్సులకు నిప్పు పెట్టారు . బస్సులకే కాకుండా అగ్నిమాపక వాహనానికి కూడా ఆందోళనకారులు నిప్పంటించారు . ఈ ఆందోళనతో తమకు ఎటువంటి సంబంధం లేదని   జామియా మిలియా  ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం ప్రకటించింది. ఇందులో స్థానికులే పాల్గొన్నారని పేర్కొంది .

 

పౌరసత్వ సవరణ చట్టం ను తీసుకురావడం వల్ల తొలుత ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు రేగిన విషయం తెల్సిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ  అసోం , త్రిపురలలో స్థానికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు  . స్థానికుల ఆందోళన కాస్తా హింసాత్మకంగా మారడంతో కేంద్రం అదనపు బలగాలను మోహరించింది . మిగిలిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ,  ఇప్పటికే అసోం , త్రిపుర రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి, ఇతర  రాష్ట్రాల నుంచి  వచ్చి స్థిరపడిన వారి సంఖ్య పెరిగి , స్థానికులు మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందంటూ ,  స్థానికులు పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ , రోడ్లపైకి వచ్చారు . అయితే అటువంటి ప్రమాదమేమీ లేదని, అనవసర అపోహలకు తావు ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ , ఆందోళనకారులు  మాత్రం వెనక్కితగ్గడం లేదు .

 

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రారంభమైన నిరసనలు ప్రస్తుతం ఢిల్లీని కూడా తాకడం తో , పరిస్థితి క్రమేపి అదుపు తప్పుతున్నట్లు కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .ఈ ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు  కేంద్రం సత్వరం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: