దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై మానవ హక్కుల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయానా దిశ తండ్రి ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొని మానవ హక్కుల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "మా పాప చనిపోయినప్పుడు ఈ మానవ హక్కులు ఏమయ్యాయి. ఇప్పుడు నిందితులు చనిపోయినప్పుడు గుర్తుకు వచ్చాయా మానవ హక్కులు" అంటూ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ లో మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

 

ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు నుంచి కొందరు కావాలనే మృగాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటాగా స్వీకరించిన మానవ హక్కుల సంఘం రాష్ట్రానికి వచ్చి దాదాపు నాలుగు రోజుల పాటు ఎన్‌కౌంటర్‌ పై విచారణ జరిపారు. మానవ హక్కుల సంఘం వారు దిశ తల్లితండ్రులను తెలంగాణ పోలీస్ అకాడమీ కి పిలిపించి విచారణ చేపట్టడంతో దిశ కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నారంటూ ప్రజాసంఘాలు ఆందోళన చేసాయి. ఇలాంటి కఠిన శిక్షలు పడితేనే దిశ తరహా ఘటనలు పునరావృతం కావని ప్రజలు చెప్తున్నారు.

 

మరోవైపు దిశ ఘటన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్లవాత్మక చట్టం తీసుకువచ్చింది. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కేవలం 21 రోజుల్లోనే మరణ శిక్ష విధించనున్నట్లు ఈ చట్టం పేర్కొంటుంది. ఈ చట్టంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఎన్‌కౌంటర్‌ పై ఈ సంఘాలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రస్తుతం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై సుప్రీంలో విచారణ జరుగుతోంది, సుప్రీం ఈ ఎన్‌కౌంటర్‌ పై విచారణను త్రి సభ్య కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: