మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో సంపాదించిన కీర్తి అసామాన్యం. సినిమాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రజల్లోకి వచ్చారు. ఎన్నికలకు సిద్ధమవుతూండగా పార్టీకి పరకాల ప్రభాకర్ రూపంలో మొదటి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షాత్తూ పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రజారాజ్యం తీరును ఆయన ఎండగట్టారు. పార్టీలో ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోందని, మరెవరూ పైకి ఎదిగే అవకాశం లేదని, సీట్ల అమ్మకం జరుగుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ పునాదులను కదిపేసింది. 

 

 

ఈ తతంగమే ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటానికి మొదటి కారణమని చెప్పాలి. అన్నయ్య దారిలోనే సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్.. అదే అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చినట్టే కొన్నాళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జనసేనలో జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ప్రజారాజ్యం పరిస్థితులు గుర్తు రాక మానదు. ప్రజారాజ్యంను పరకాల ప్రభాకర్ ఎలా ఎండగట్టారో.. జనసేనను రాజు రవితేజ అదే విధంగా ప్రజల్లో దోషిగా నిలబెట్టారని పరిశీలకులు అంటున్నారు. పార్టీలు, మనుషులు మారారు తప్ప పార్టీని ప్రజల్లో చులకన చేయటంలో మాత్రం ఒకటే థియరీ పాటించారని అంటున్నారు. 

 

 

జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఇదే అవగతమవుతుంది కూడా. కాకపోతే ప్రజారాజ్యంకు ఎన్నికల ముందు ఇలా జరిగితే.. జనసేనకు ఎన్నికల అనంతరం పరాభావం జరిగింది. చిరంజీవి-పవన్ కల్యాణ్ లు ఎవరినైతే నమ్మారో వారే పార్టీలకు వెన్నుపోటు పొడిచారని మెగా అభిమానులు మండిపడుతున్నారు. ప్రజారాజ్యం కార్యకర్తలు ఎలా ఇబ్బందిపడ్డారో జనసేన కార్యకర్తలు కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే పవన్ కాస్త పట్టుదల, ధైర్యం ఉన్న మనిషి కావడంతో ఇటువంటి పరిస్థితులకు వెరవని మనిషని చెప్పాలి. మరి.. ఈ పరిణామాలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: