ఈ మధ్య కాలంలో అమాయకులను టార్గెట్ చేసుకొని మోసాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటే నమ్మి వెళ్లిన ఒక వ్యక్తి దగ్గరనుండి సినీ ఫక్కీలో మోసగాళ్లు 11.60 లక్షలు దోచుకెళ్లారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గారపాటి కుమార్ అనే వ్యక్తి వృత్తిరిత్యా హైదరాబాద్ లో నివాసం ఉండేవాడు. అతనికి ప్రవీణ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో పిల్లల చదువు కోసం వచ్చానని చెప్పి పరిచయం చేసుకున్నాడు.
 
ప్రవీణ్ గారపాటి కుమార్ ఫోన్ నంబర్ తీసుకొని అప్పుడప్పుడు అతనికి ఫోన్ కాల్స్ చేసి పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత తక్కువ రేటుకే బంగారం ఇప్పిస్తానని చెప్పి ప్రవీణ్ కుమార్ ను నమ్మించాడు. ప్రవీణ్ చెప్పిన మాటలను కుమార్ నమ్మాడు. బంగారం కోసం కుమార్ హైదరాబాద్ నుండి మంగళగిరి వచ్చి చినకాకానిలోని లాడ్జీలో దిగాడు. ప్రవీణ్ నిన్న సాయంత్రం ఫోన్ చేసి యజమానితో సహా బంగారం తీసుకొనివస్తున్నానని నమ్మించాడు. 
 
ప్రవీణ్ కుమార్ కు డబ్బులను తీసుకొని ఆత్మకూరు గ్రామ సమీపంలోని ఆలయం దగ్గరకు రావాలని సూచించాడు. అక్కడ కుమార్ నగదుతో వేచి ఉండగా కొందరు వ్యక్తులు కుమార్ దగ్గరకు వచ్చి దొంగ బంగారం అమ్ముతున్నారంటూ తమకు ఫిర్యాదు అందిందని కుమార్ ను తనిఖీ చేశారు. ఆ తరువాత కుమార్ ను బ్యాగుతో పాటు కారులో ఎక్కించుకొని అతని దగ్గర నుండి మొబైల్ ను, బ్యాగును లాక్కుని అతనిని కారు నుండి తోసేశారు. 
 
కుమార్ ను తనిఖీ చేయడానికి వచ్చిన నలుగురిలో ఒకడు పోలీస్ యూనిఫాంలో ఉన్నాడని తెలుస్తోంది. ఊహించని విధంగా డబ్బును, మొబైల్ ను లాక్కొనిపోవటంతో షాక్ అయిన కుమార్ వెంటనే ఏపీఎస్పీ బెటాలియన్ లో పని చేస్తున్న తన స్నేహితునికి ఈ విషయం గురించి సమాచారం ఇచ్చాడు. ఆ తరువాత అతని స్నేహితుని సాయంతో కుమార్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: