విచిత్రంగా ఉందా చదవటానికి. వైసిపిలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న కీలక నేత విజయసాయిరెడ్డి అనే అందరికీ తెలుసు.  పేరులోనే విజయసాయిరెడ్డి అని ఉంది కాబట్టి కీలక నేత కులం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కోసారి ప్రాంతాన్ని బట్టి కొందరు నేతల సామాజికవర్గాల్లో అయోమయం వచ్చేస్తుంది. ఇపుడు విజయసాయి సామాజికవర్గం విషయంలో కూడా అయోమయం మొదలైంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజికవర్గం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి కాపు ప్రముఖులంతా హాజరయ్యారు. మామూలుగా సామాజికవర్గాల వారీగా జరిగే ఇటువంటి కార్యక్రమాలకు మరో సామాజికవర్గం నేతలు ఎవరూ హాజరుకారన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇలాంటి వనభోజనాల కార్యక్రమానికి ఆశ్చర్యంగా వైసిపీ కీలక నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు.  హాజరవ్వటమే కాకుండా వేదిక మీదకు ఎక్కి మాట్లాడారు కూడా. దాంతో కాపు యువకుల్లో అసహనం బయటపడింది. వెంటనే విజయసాయిరెడ్డిని తీసుకొచ్చిన మంత్రి అవంతి శ్రీనివాస్ కు  వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. వెంటనే వేదిక మీద నుండి విజయసాయిని దింపేయాలంటూ గట్టిగా కేకలు పెట్టారు.

 

సరే వీళ్ళ గోలమధ్యలోనే మైకు తీసుకున్న విజయసాయి మాట్లాడుతూ ’తాను కూడా కాపునే’ అన్నారు. తాను నెల్లూరు జిల్లాలో రెడ్లను కాపులుగానే  పిలుస్తారంటూ చెప్పారు.  ’తన 10వ తరగతి సర్టిఫికేట్లపై ఓసి కాపు అనే ఉంటుంది కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు’ అని కూడా చెప్పారు.  

 

నిజానికి పేరు చివరన నాయుడు అని ఉన్నంత మాత్రానా అందరూ కమ్మవాళ్ళు కారు. కొన్ని ప్రాంతాల్లో నాయుడు అంటే కాపులు కూడా అయ్యుండచ్చు. అలాగే చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ప్రాంతంలో పేరు చివరన రెడ్డి అని ఉన్నంత మాత్రానా రెడ్డి కాదు కాపులు. కాబట్టి విజయసాయి చెప్పిందాంట్లో అబద్ధమేమీ లేదు. కాకపోతే తాను కాపునే అని విజయసాయి చెప్పటంతో ఇపుడు విజయసాయిరెడ్డిది కాపు సామాజికవర్గమా లేకపోతే రెడ్డియేనా అన్న అనుమానం మొదలైంది. 10వ తరగతి సర్టిఫికేట్ లో ఓసి కాపు అని ఉందని ఆయనే చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: