దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్భయ కేసులో బాధితురాలైన ఆడ‌బిడ్డ త‌ల్లిదండ్రులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘నిర్భయ’ ఘటన జరిగి డిసెంబర్ 16 నాటికి ఏడేళ్లు గడుస్తున్నాయి. ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో నలుగురు వినయ్‌శర్మ, పవన్‌ గుప్తా, రామ్‌సింగ్‌, ముఖేశ్‌ సింగ్‌కు ఉరి ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు త్వరలో ఉరిశిక్ష అమలుచేయవచ్చని జోరుగా వార్తలు వెలువడుతుండటంతో ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, అయినప్పటికీ దోషులకు డెత్‌ వారెంట్‌ జారీచేసి ఉరిశిక్ష తేదీని ఖరారుచేసే వరకు ఇలాంటి వార్తలను నమ్మలేమని ఆమె అన్నారు.

 


‘నిర్భయ’కు న్యాయం విష‌యంలో ఆమె త‌ల్లిదండ్రులు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. గత ఏడేళ్ల‌ నుంచి సాగించిన పోరాటంతో తాము ఎంతో అనుభవాన్ని గడించామని, క్రిమినల్‌ న్యాయవ్యవస్థలోని లొసుగులేమిటో, వాటిని ఎలా అధిగమించాలో అవగతమైందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కామాంధుల చేతిలో అఘాయిత్యాలకు గురైన బాధితులకు నిర్ణీత వ్యవధిలోగా న్యాయం జరిగేలా పోరాడుతామని తెలిపారు. రివ్యూ పిటిషన్లు లేదా క్షమాభిక్ష పిటిషన్ల దాఖలుకు నిర్ధిష్ఠ గడువుతో కూడిన విధానమేదీ లేదని, వీటికి గడువును నిర్దేశించాల్సిన అవసరమున్నదని ఆవేద‌న‌తో వ్య‌క్తం చేశారు. దిగువకోర్టు తీర్పుపై కేవలం పరిశీలన జరిపేందుకే హైకోర్టులు, సుప్రీంకోర్టు అధిక సమయం తీసుకోవడం సరికాదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతామని, కన్న కూతుర్ని కోల్పోయి ఎంతో క్షోభకు గురైనప్పటికీ భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోలేదని, తమకు దేవుని అండ ఉన్నదని ‘నిర్భయ’ తండ్రి చెప్పారు. ‘నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలుచేయడం ద్వారా నిర్భయకు న్యాయం జరుగుతుంది. కానీ నిర్భయ లాంటి బాధితులు దేశంలో ఎంకా ఎంతోమంది ఉన్నారు. వారికోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.

 

 

ఇక ఢిల్లీ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు నిర్భ‌య త‌ల్లిదండ్రులు. ‘మా సర్వస్వాన్నీ ఢిల్లీ హరించివేసింది. అంతమాత్రన ఢిల్లీని నిందించబోము. ఎందుకంటే.. మా సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగని ప్రదేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. కనుక మొత్తం ప్రపంచాన్ని మనం అసహ్యించుకోలేము’ అని ‘నిర్భయ’ తల్లి పేర్కొన్నారు. ఇకనైనా పరిస్థితులు బాగుపడతాయని ఆశిస్తున్నామని, అలా జరుగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం క‌న్నీళ్ల‌తో వ్య‌క్త‌ప‌రిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: