చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తినే వారు మనలో చాలా మందే ఉంటారు. చాలా మందికి ఆదివారం రోజు వచ్చిందంటే చికెన్ లేనిదే ముద్ద కూడా దిగదు. ఉత్పత్తి భారీగా ఉండటం, అధ్యాత్మిక దీక్షల కాలం కావడం, చలి తీవ్రత మొదలైన కారణాల వలన చికెన్ ధరలు తగ్గుతున్నాయి. మార్కెట్ లో కిలో చికెన్ ధర 150 రూపాయల నుండి 180 రూపాయల మధ్య పలుకుతోంది. వారం రోజుల క్రితం చికెన్ ధరలు 220 రూపాయలు ఉండగా 150 రూపాయలకు తగ్గడం గమనార్హం. 
 
అయ్యప్ప భక్తుల సీజన్ కావడం మరియు చలి తీవ్రత పెరగటంతో జనాలు చికెన్ కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపట్లేదు. లైవ్ చికెన్ హోల్ సేల్ ధర 82 రూపాయల నుండి 92 రూపాయల మధ్య పలుకుతోంది. గత వారం రోజుల్లో చికెన్ ధరలు విపరీతంగా తగ్గాయి. డిమాండ్ కంటే కోళ్ల ఉత్పత్తి ఎక్కువ కావటం వలన కూడా చికెన్ ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. ఉత్పత్తికి సరిపడా అమ్మకాలు లేకపోవడం వలన కూడా ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో సాధారణ రోజుల్లో 4 లక్షల కేజీల నుండి 5 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతాయి. హైదరాబాద్ నగరంలో మాత్రమే లక్ష కేజీలకు అటు ఇటుగా విక్రయాలు జరుగుతాయి. సాధారణ రోజులతో పోలిస్తే వ్యాపారం సగానికి సగం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. డిసెంబర్ నెల మొదటి వారం నుండే చలి తీవ్రత, అయ్యప్ప దీక్షల వలన చికెన్ ధరలు విపరీతంగా తగ్గాయి. 
 
ఒక హోల్ సేల్ వ్యాపారి మాట్లాడుతూ గతంలో రోజుకు 80 కిలోలు విక్రయించేవాడినని ఇప్పుడు 30 కిలోల చికెన్ కూడా విక్రయించటం లేదని చెబుతున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే చికెన్ వినియోగం సగానికి సగం తగ్గిందని చెప్పాడు. నాంపల్లికి చెందిన మరో వ్యాపారి మాట్లాడుతూ ఆదివారం రోజున 150 కిలోల చికెన్ విక్రయించేవాడినని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పటం గమనార్హం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: