టీడీపీకి ఒక‌ప్పుడు కంచుకోట‌గా ఉన్న అనంత‌పురం జిల్లాలో ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి ఏంటి ? ఏ నాయ‌కుడు ఎలాంటి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు ?  పార్టీని ముందుండి న‌డిపించ‌డం మాట అటుంచి నియోజ‌క‌వ‌ర్గం  లో అయినా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకునే వారు ఉన్నారా ?  నిన్న‌టి ఎన్నిక‌ల్లో టికెట్లు తెచ్చుకుని పోటీ చేసిన యువ నాయ‌కులు ఇప్పుడు ఎక్క‌డ దాక్కున్నారు ? ఏం చేస్తున్నారు ? అస‌లు పార్టీ ప‌రిస్థితి జిల్లాలో ఎలా ఉంది ? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2014లో భారీ ఎత్తున పుంజుకున్న టీడీపీ కేవ‌లం ఐదేళ్లు గ‌డిచేస‌రికి చ‌తికిల ప‌డిపోయింది.

 

పార్టీని ప‌ట్టించుకునే నాధుడు ఎవ‌రూ  క‌నిపించ‌డంలేదు. జిల్లాలోని ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. స‌రేలే.. అని స‌రిపెట్టుకునే వారు. కానీ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక చ‌రిత్ర అన్న‌ట్టుగా ఇప్పుడు టీడీపీ కుదేలైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 2014లో పార్టీకి అండ‌గా ఉన్న జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గం పూర్తిగా ఇప్పుడు పార్టీలో కార్య‌క్ర‌మాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. రెండు టికెట్లు తెచ్చుకుని పోటీ చేసిన జేసీ ప‌వ‌న్ కానీ, జేసీ అస్మిత్ రెడ్డికానీ ఓటమి త‌ర్వాత పార్టీకి పూర్తిగా దూర‌మ‌య్యారు. ఇక‌, పార్టీలో హిందూపురం నుంచి పోటీ చేసి వ‌రుస విజ‌యాలు సాధించిన సొంత వియ్యంకుడు బాల‌య్య సినిమాల‌తో బిజీగా గ‌డిపేస్తూ.. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గం గురించి కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు.

 

ఇక‌, ప‌రిటాల కుటుంబం కూడా సైలెంట్ అయిపోయింది. ఏం మాట్లాడితే.. ఎలాంటి కేసులు మెడ‌కు చుట్టుకుంటాయో.. అని ఈ కుటుంబం అస‌లు రాజ‌కీయాల ఊసే ఎత్త‌డం లేదు. ధ‌ర్మ‌వ‌రంలో మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి పార్టీ మారిపోయాక అక్క‌డ కూడా ప‌రిటాల కుటుంబానికి బాధ్య‌త‌లు ఇచ్చినా వాళ్లు ఒక‌టి రెండు సార్లు వెళ్ల‌డం మిన‌హా అటు వైపు కూడా క‌న్నెత్తి చూడ‌డం లేదు. ఇక‌, మాజీ మంత్రి ప‌ల్లెర‌ఘునాథ‌రెడ్డి పూర్తిగా రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కేవ‌లం కాల్వ శ్రీనివాసులు మాత్ర‌మే ఓడిపోయినా అడ‌పా ద‌డ‌పా వాయిస్ వినిపిస్తున్నారు.

 

అదే స‌మ‌యంలో క‌ళ్యాణ‌దుర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హ‌నుమంత రాయ చౌద‌రి, సురేంద్ర‌నాయుడు మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగుతూనే ఉంది.  ఓడిపోయిన నిమ్మ‌ల కిష్ట‌ప్ప కూడా దూరంగానే ఉంటున్నారు. ఇక‌, శింగ‌న‌మ‌ల‌లో యామినీ బాల ఆమె త‌ల్లి శ‌మంత‌క‌మ‌ణిల మ‌ధ్య ఉప్పు నిప్పుగా ప‌రిస్థితి మారిపోయింది. దీనికి తోడు ఇక్క‌డ జేసీ హ‌ల్ చ‌ల్ మ‌రింత‌గా పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇక అనంత‌పురం అర్బ‌న్‌లో మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర చౌద‌రి కూడా ప‌ట్టించుకోవ డంలేదు. ఓవ‌రాల్‌గా జిల్లాలో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న బీసీ ఓటు బ్యాంకు కూడా పార్టీకి పూర్తిగా దూరమైంది. ఈ ప‌రిస్థితిలో అనంత‌పురం టీడీపీ రాజ‌కీయాలు గంద‌ర‌గోళం మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఎప్ప‌టికి ఇవి ప‌ట్టాలెక్కుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: