పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక పసుపు బోర్డు రాదని తేల్చేశారు. దేశంలో చాలా పంటలకు బోర్డులు ఉన్నాయని, వాటి వల్ల ప్రయోజనమేమీ ఉండడం లేదని వ్యాఖ్యానించారు. 

 

అయితే, అంతకుమించి ప్రయోజనాలున్న పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. కొత్త పథకం గురించి జనవరిలో శుభవార్త వినిపిస్తుందని చెప్పారు. పసుపు జాతీయ పంట కాకపోయినా, మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం అంగీకరించినట్లు స్పష్టం చేశారు. అయితే, మద్దతు ధరకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపడం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. 

 

నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పసుపు బోర్డు కింద పంటను నియంత్రించడం.. మద్దతు ధర కల్పించడం, పంటను ప్రమోట్ చేయడం, సబ్సిడీపై రుణాల కోసం బ్యాంకులతో చర్చలు జరపడం, పండించేందుకు అధునాతన పరికరాలు సమకూర్చడం వంటి పనులు పసుపు బోర్డు ద్వారా నెరవేరతాయి. పంట చేతికందాక దాన్ని విక్రయించే బాధ్యత కూడా బోర్డు పరిధిలోనే ఉంటుంది. పంటను ఎగుమతి చేయడమా లేదా ఫ్యాక్టరీకి చేరవేడమా? లేక మధ్యవర్తి ద్వారా విక్రయించడమా? అన్న విషయాలు బోర్డు పరిధిలోకి వస్తాయి. కానీ, ఈ మధ్య బోర్డులు సరిగ్గా పని చేయడం లేదు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు.’’ 
 

అందుకే, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య వర్తక వాణిజ్య మౌలిక సదుపాయాలు పెంపొందించుకొనేందుకు ‘టైస్’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బోర్డు చేసే పనులన్నీ కల్పిస్తారు. పంటను విదేశాలకు ఎగుమతి చేసే వెసులుబాటు కూడా కనిపిస్తుంది. ఇంటర్ మినిస్టీరియల్ ఎక్స్‌పోర్ట్ ఆధారిత స్కీమ్ ఇది. దేశంలోని ఇతర బోర్డులకు కూడా ఇది నిధులు సమకూర్చుతుంది. టైస్ పథకం గురించి కేంద్రంతో అన్ని చర్చలు ముగిశాయి. ఇక దీని అమలు ప్రక్రియ మొదలైంది. నా అంచనా ప్రకారం మరో 10 నుంచి 15 రోజుల్లో నన్ను ఢిల్లీకి పిలిచే అవకాశముంది. మొత్తానికి సంక్రాంతి పండుగకు ముందో తర్వాతో మనకు శుభవార్త రావొచ్చు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేంద్రానికి పంపాల్సి ఉంది. దీని గురించి ఇప్పటికే 6 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాను. మళ్లీ రేపు లేఖ కూడా రాయబోతున్నాను అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివరించారు. 
 
 
లోక్‌సభ ఎన్నికలకు ముందు అర్వింద్ పసుపు బోర్డు తీసుకొస్తానని ప్రకటించారు. లేదంటే, తన పదవికి రాజీనామా చేసి రైతులతో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బాండ్ పేపర్ మీద రాశారు. దీంతో అర్వింద్ యూటర్న్ తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పసుపు బోర్డు సాధన సమితి కూడా ఎంపీపై దుమ్మెత్తిపోస్తోంది. ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆయన రాజీనామా చేస్తే...పసుపు బోర్డు అదే వస్తుందని రైతులు చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థి రాజీనామా చేయడం ద్వారా దేశ వ్యాప్త చర్చ జరుగుతుందని అప్పుడు కేంద్రం దానికదే దిగివస్తుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: