చంద్రబాబునాయుడుకు  హై కోర్టు తాజాగా షాకిచ్చింది. కొత్తగా కట్టిన తెలుగుదేశంపార్టీ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ తో పాటు తెలుగుదేశంపార్టీకి హై కోర్టు నోటీసులిచ్చింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకుందనే ఆరోపణలున్నాయి. ఇదే విషయమై వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు.

 

వైసిపి ఎంఎల్ఏ పిటీషన్ ఆధారంగానే కోర్టు అందరికీ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించుకుని టిడిపి పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నట్లు ఆళ్ళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ స్ధలాన్ని ఆక్రమించుకుని పార్టీ కార్యాలయం కట్టుకున్నట్లు అప్పట్లోనే జనాలు కూడా చెప్పుకున్నారు. అదే సందర్భంలో మున్సిపాలిటి నుండి స్ధలాన్ని లీజుకు తీసుకున్నట్లు టిడిపి నేతలు చెప్పుకోవటంలో కూడా లొసుగులున్నట్లు సమాచారం.

 

మున్సిపాలిటి నుండి లీజుకు తీసుకున్న స్ధలానికి పక్కనే ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని కూడా కలిపేసుకుని రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించుకున్నట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. లీజుకు తీసుకున్న పత్రాలు కానీ పక్కనే ఉన్న స్ధలాన్ని కలిపేసుకున్న ఆరోపణలపైన కానీ టిడిపి నేతలు సరైన సమాధానాలు చెప్పుకోలేకపోతున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరికీ సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఇంతకాలం అనుకున్నారు.

 

అందుకనే ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలోనే టిడిపి అధికారంలో నుండి దిగిపోయింది. దాంతో ఒక్కసారిగా సమస్యలు మొదలయ్యాయి. ఇపుడిదే సమస్య చంద్రబాబును చుట్టుకుంది. ప్రభుత్వ స్ధలాన్ని తాము ఆక్రమించుకోలేదని ఇపుడు  నిరూపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశంపార్టీపైన పడింది.

 

ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవటమన్నది మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం మాత్రమేనా లేకపోతే  జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల నిర్మాణాలన్నీ ఇలాగేనా అన్నది తేలాలి. గుణదలలో నిర్మించిన కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించుకుని నిర్మించిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరి తాజాగా హైకోర్టులో తొందరలో జరగబోయే విచారణతో అన్నీ విషయాలు బయటకు వస్తాయేమో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: