2019 ఎన్నికల ఫలితాల తరువాత జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవటం, జనసేన పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో గెలవటంతో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులోనైనా పుంజుకుంటుందా...? అనే అనుమానాలు మొదలయ్యాయి. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పటికే జగన్ కు అనుకూలంగా పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేయటంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. 
 
భవిష్యత్తులో రాపాక వరప్రసాద్ పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న రాజు రవితేజ పార్టీ నుండి ఇప్పటికే బయటకు వచ్చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ గురించి మీడియా సమావేశంలో విమర్శలు చేశారు. మరికొందరు కీలక నేతలు కూడా జనసేన పార్టీ నుండి బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. వీవీ లక్ష్మీనారాయణ కూడా జనసేన పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
వీవీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం బీజేపీ పార్టీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో లక్ష్మీనారాయణ బీజేపీలో చేరే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. విశాఖలో జనసేన పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. గత కొన్ని రోజులుగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో వీవీ లక్ష్మీనారాయణ కనబడలేదు. మేధావిగా పేరున్న లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలనే లక్ష్యంతో ఉండటంతో లక్ష్మీనారాయణను చేర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. లక్ష్మీనారాయణ బీజేపీలో చేరితే అతనికి ఏదో ఒక పదవి కూడా లభించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం లక్ష్మీనారాయణ బీజేపీ పార్టీతో చర్చలు జరుపుతున్నారని ఈ నెలాఖరులోపు లక్ష్మీనారాయణ బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: