తెలంగాణ మంత్రిపై కుట్ర చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న క‌లెక్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ షాక్ ఇచ్చారు. హ‌ఠాత్తుగా ఆయ‌న్ను బ‌దిలీ చేశారు. కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు బీజేపీ అభ్యర్థితో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని, అందులో క‌లెక్ట‌ర్ పాత్ర పోషించిరాని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. దీనికి కార‌ణం, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ప్ర‌స్తుత ఎంపీ బండి సంజయ్‌ కుమార్, కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ. 1.30 నిమిషాల ఆడియో టేప్‌ను కొందరు వ్యక్తులు వైరల్‌ చేయగా.. అందులో కలెక్టర్‌ సూచనలు, సంజయ్‌ కృతజ్ఞతలే ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ సంభాషణ 8 నిమిషాలు జరిగిందని, కట్, మిక్స్‌ విధానం ద్వారా కొందరు తమ సంభాషణను వక్రీకరించి వైరల్‌ చేశారని కలెక్టర్‌ సర్ఫరాజ్ వివ‌ర‌ణ ఇచ్చారు. 

 


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఫాలో అప్‌ చేసుకోమని ఎమ్మెల్యే అభ్య‌ర్థి బండి సంజ‌య్‌కు క‌లెక్ట‌ర్‌ సూచించడం వివాదాస్పదమైంది. 8 నిమిషాల ఆడియో టేప్‌ను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు మంత్రి గంగుల కమలాకర్ పంపించారు. తనను ఓడించేందుకు బీజేపీ అభ్యర్థితో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని లిఖి తపూర్వక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్‌పై వచ్చిన ఆరోపణలపై సీఎస్‌ విచారించిన‌ట్లు సమాచారం. జిల్లా పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచి అధికారులు ఈ లీకైన ఆడియో టేపులను ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిసింది.

 


మ‌రోవైపు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తన ఓటమి లక్ష్యంగా పనిచేశారని మంత్రి గంగుల కమలాకర్‌ బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఓడిన అభ్యర్థులు ఫిర్యాదులు చేయడం, కోర్టులను ఆశ్రయించడం సహజమే కానీ, ఆ అభ్యర్థులకు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న అధికారి సలహాలు, సూచనలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇలా అన్ని ర‌కాలుగా ఎదురైన ఒత్తిళ్ల నేప‌థ్యంలో...ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లెక్ట‌ర్‌పై వేటు వేసిన‌ట్లు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: