అభం శుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి, ఆపై హత్య చేసిన ఉదంతం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా హాజీపూర్‌లో చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా, కల్పన లను వేర్వేరు ఘటనల్లో అత్యాచారం, హత్య చేసి తన పొలంలోని బావిలోనే పూడ్చిపెట్టాడు దుర్మార్గుడైన నిందితుడు శ్రీ‌నివాస్‌రెడ్డి. శ్రావణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జనం మధ్యలోనే ఏం ఎరుగనట్టు తిరుగుతున్న శ్రీనివాస్ రెడ్డే నిందితుడనీ తేల్చి అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో ఆగ్రహావేశాలకి లోనైన ప్రజలు నిందితుడిని ఇంటిని తగులబెట్టారు. ఈ కేసులో నిందితుడికి ఇంకా ఎటువంటి శిక్ష వేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా గవర్నర్ త‌మిళ‌సైని హజీపూర్ బాధిత కుటుంబాలు రాజ్‌భ‌వ‌న్‌లో క‌లిశాయి. బీసీ సంఘం ఆధ్వర్యంలో హాజీపూర్ గ్రామ బాధిత కుటుంబాలతో కలిసి గవర్నర్‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌రిచారు. ``శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం,హత్య చేసి చంపాడు. ఇలాంటి ఘటనలు జిల్లాకో ఘటన జరుగుతున్నాయి. బడుగు బలహీన వర్గాలు పిల్లలను బావిలో పూడ్చిపెట్టాడు. ఇప్పటి వరకు శ్రీనివాస్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అగ్రకులాలకు, బడుగు వర్గాలకు ఒక న్యాయం ఉండకూడదు.`` అని చెప్పిన‌ట్లు బీసీ సంఘం నేత జాజుల శ్రీ‌నివాస్ వెల్ల‌డించారు. త‌మ‌ను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు చెప్పగానే ఆమె సానుకూలంగా స్పందించారని వెల్ల‌డించారు. తన లిస్టులో హాజీపూర్ ఇష్యూ ఉందని, ఆ విషయం మొత్తం తెలుసు అని చెప్పారని ఆయ‌న పేర్కొన్నారు. 

 

అకార‌ణంగా క‌న్నుమూసిన శ్రావణి తల్లి మాట్లాడుతూ...త‌మ అమ్మాయిని చంపిన శ్రీనివాస్‌రెడ్డిని కూడా అలాగే చంపాలని కోరారు. శ్రీ‌నివాస్ రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాన‌ని తాను చెప్ప‌గా..గవర్నర్ మేడం కూడా సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు. హాజిపూర్ సర్పంచ్ కవిత మాట్లాడుతూ, త‌మ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం లేక ఇలాంటి ఇబ్బందులు పునరావృత్తం అవుతున్నాయన్నారు. అమ్మాయిలను హత్య చేసిన శ్రీనివాస్‌ని శిక్షించాలని కోరామ‌ని పేర్కొన్నారు. మనీషా తండ్రి మాట్లాడుతూ..దిశ ఘటనలో నిందితులను ఎలా చంపారో  అదే విదంగా శ్రీనివాస్ ని చంపాలని గవర్నర్ ని కోరామ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: