రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి ప‌క్షం చేస్తే.. త‌ప్పు.. తాము చేస్తే.. ఒప్పు.. అనే వ్య‌వ‌హారాలు కామ‌న్‌! ఇప్పుడు అచ్చు అలాంటి ప‌రిణామ‌మే ఏపీలోనూ సాగుతోంది. గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ త‌మ‌కు అసెంబ్లీలో మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని పెద్ద ఎత్తున గొంతు చించుకుంది. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీ స్పీక‌ర్‌పైనా అవిశ్వాసం ప్ర‌క‌టించింది. అదేస‌మ‌యంలో స‌భ నుంచి అనేక మార్లు వాక‌వుట్ చేసింది. దీనిని అప్ప‌ట్లో ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీ భారీ ఎత్తున విమ‌ర్శించింది. త‌మ‌కు అనుకూలంగా రాజ‌కీయంగా దీనిని మ‌లుచుకుంది.

 

జ‌గ‌న్‌కు స‌భ‌లో ఉండ‌డం ఇష్టం లేక‌, తాము ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటే చూడ‌లేక స‌భ నుంచి వాక‌వుట్ చేశారంటూ.. మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు టీడీపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉంది. తాజాగా శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాల్లో జ‌గ‌న్ అనేక బిల్లులు ప్ర‌వేశ పెట్టేందుకు ముందుకు వ‌చ్చారు. కీల‌క‌మైన దిశ చ‌ట్టాన్ని స‌భ ఆ మోదించింది. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మానికి కూడా పెద్ద‌పీట వేసేలా బిల్లును స‌భ ముందుకు తెచ్చారు. ఇక‌, లిక్క‌ర్‌కు సంబంధించిన విధివిధానాల‌పైనా చ‌ర్చ‌కు రెడీ అయ్యారు.

 

ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ తాజాగా సోమ‌వారం నాటి స‌భ నుంచి వాక‌వుట్ చేసింది. ఆరవరోజు సోమవారం ఉదయం శాసనసభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో హౌసింగ్‌పై చర్చలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగించారు. ఆయన చెప్పింది ఏమీ అర్థం కాలేదని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు స్పీకర్‌‌ను కోరారు. అందుకు సభాపతి అవకాశం ఇవ్వకుండా వేరే ప్రశ్నకు వెళ్లారు. దీంతో ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా...వేరే ప్రశ్నకు వెళ్లడంపై టీడీపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది.

 

అయితే, త‌మ‌కు నిబ‌ద్ధ‌త ఉంద‌ని, సీనియ‌ర్లం మేమేన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు వాక‌వుట్‌ను త‌న స‌భ్యుల‌ను అనుమ‌తించ‌డం మేధావులు సైతం ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇది మంచిది కాద‌నే అంశాన్ని వారు లేవ‌నెత్తుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: