అవును! ఇప్పుడు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో దీనిపైనే చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లోనే అంటే మ‌రో నెల రోజుల్లోపే.. రాష్ట్రంలో స్థానిక స‌మ‌రానికి రాష్ట్ర ప్ర‌భుత్వం రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన అమ్మ ఒడి ప‌థ‌కాన్ని జ‌న‌వ‌రి 26న ప్రారంభించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. దీనికి అదే నెల 9వ తేదీకి మార్చింది. దీంతో ఎ న్నిక‌ల‌కు ప‌క్కా వ్యూహంలో జ‌గ‌న్ ప్ర‌బుత్వం రెడీ అయింద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. కీల‌క‌మైన పథ కాలు, ప్ర‌జ‌ల‌కు మేలు చేసే సంక్షేమ కార్య‌క్ర‌మాలు, రైతుల‌కు భ‌రోసా వంటి కార్య‌క్ర‌మాలు స‌హా యువ‌త‌కు జ‌గ‌న్ పెద్ద ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలోనిస్థానిక సంస్థ‌ల‌ను క్లీన్ స్వీప్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న దూసుకుపోతున్నారు.

 

మ‌రి ఈ స‌మ‌యంలో టీడీపీని బ‌లోపేతం చేసుకునే వ్యూహం దిశ‌గా పార్టీఅధినేత చంద్ర‌బాబు ఏమీ చేయ డం లేదా? ఆయ‌న స్థానిక సంస్థ‌ల‌ను వ‌దిలేసుకున్నారా? ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు కూడా ఆయ‌న‌కు మైన‌స్‌గా మారుతున్నాయా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే, అలాంటి దేమీ లేదని అంటున్నారు టీడీపీ నేత‌లు. చంద్ర‌బాబు స్థానిక సంస్థ‌ల‌ను సీరియ‌స్‌గానే తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే నెల రోజుల కింద‌ట ఆయ‌న యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని ప‌దవుల్లో 33 శాతం వారికే కేటాయిస్తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇది పార్టీకి బూస్ట్‌మాదిరిగా ప‌నిచేస్తుంద‌ని చెప్పుకొచ్చారు.

 

అయితే, ఇప్పుడు ఆ నాయ‌కులే పెద‌వి విరుస్తున్నారు. ``మా నాయ‌కుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ, ఫ‌లితమే క‌నిపించ‌డం లేదు`` అని వారు వాపోతున్నారు. యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పిన త‌ర్వా త కూడా యువ‌త కు అధ్య‌క్షుడుగా ఉన్న అవినాష్ పార్టీ మారిపోవ‌డం, యువ నాయ‌కులు పెద్ద ఊపు చూపించ‌క‌పోవ‌డం వంటివాటిని వారు చెబుతున్నారు. ఈ ప‌రిస్థితి మారేందుకు చంద్ర‌బాబుఏమైనా కీల‌క నిర్ణ‌యాలు ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుత అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే చంద్ర‌బాబు స్థానిక స‌మ‌రంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే ఆలోచ‌న చేస్తున్నార‌ని అంటున్నారు. ఏదేమైనా.. అధికార ప‌క్షం దూకుడు ముందు ప్ర‌తిప‌క్షం పేల‌వంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: