తెలంగాణ ఆర్టీసీ విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న మాట నిల‌బెట్టుకున్నారు. ఉత్కంఠ‌ను రేకెత్తించిన సమ్మె విష‌యంలో సీఎం కేసీఆర్ ఆఖ‌రికి ఓ ముగింపు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణలోని ఆర్టీసీలో ఒక్కో డిపో నుంచి ఆరుగురు ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమై...ఈ సందర్భంగా వారికి వ‌రాలు కురిపించారు. అందులో ఒక్కొక్క‌టిగా అమ‌ల్లో పెడుతున్నారు. తాజాగా, ఆర్టీసీ కార్మికుల‌ను ఇక‌నుంచి ఉద్యోగులుగా ప‌రిగ‌ణించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. 

 

ఆర్టీసీ కార్మికుల‌తో భేటీ స‌మ‌యంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచుతూ ముఖ్య‌మంత్రి కేసీఆర్  నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. సమ్మె కాలానికి (52 రోజులు) సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. బాగా పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళితే సింగరేణి తరహాలో ప్రతి సంవత్సరం బోనస్ కూడా ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతోపాటుగా కార్మికులు అని పిల‌వ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేదంటూ...ఉద్యోగులుగా ప‌రిగ‌ణించాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్  ఆదేశించారు. ఈమేర‌కు తాజాగా అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

 

 

ఇదిలాఉండ‌గా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  పటాన్‌చెరులోని ఆర్టీసీ కార్మికులతో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా ఆర్టీసీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని  అన్నారు. ఆర్టీసీలో టికెట్ ధర పెంచుకున్నామని... హైదరాబాద్‌లోనే 54 లక్షల ఆదాయం పెరిగిందని హరీశ్ రావు అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు సమ్మె చేసిన కాలానికి జీతం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ మనందరి సంస్థ అని... దీనిని బలోపేతం చేసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: