తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆర్టీసీ కార్మికుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌నుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 52 రోజుల పాటు సాగిన దీర్ఘ‌కాలిక స‌మ్మెకు చెక్ పెడుతూ...కార్మికుల‌తో వ్య‌క్తిగ‌తంగా స‌మావేశ‌మైన కేసీఆర్ వారితో భోజనం చేసి హామీలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామనే ప్ర‌క‌ట‌న‌. దీనిపై హ‌రీశ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

 


పటాన్‌చెరులో ఆర్టీసీ కార్మికులకు మంత్రి హరీశ్ రావు బియ్యం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ,ర్టీసీ మనందరి సంస్థ అని... దీనిని బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నారని హ‌రీశ్‌రావు తెలిపారు. ఆర్టీసీలో టికెట్ ధర పెంచుకున్నామని... హైదరాబాద్‌లోనే 54 లక్షల ఆదాయం పెరిగిందని హరీశ్ రావు అన్నారు. సంస్థలో ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవాలని అన్నారు. కార్మికులు సమ్మె చేసిన కాలానికి జీతం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీశ్ రావు వారికి తీపిక‌బురు తెలిపారు.ఆర్టీసీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ప్ర‌క‌టించారు.

 


ఇదిలాఉండ‌గా, త‌న‌తో స‌మావేశంలో ఆర్టీసీ కార్మికుల‌కు కేసీఆర్ వ‌రాలు కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటుగా వారిపై సెల్ఫ్ డిస్మిస్ వేటు వేయ‌బోమ‌ని తెలిపారు. ఆర్టీసీ కార్మికులుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తిస్తామ‌న్నారు. మెడిక‌ల్ స‌హాయం, మ‌హిళా ఉద్యోగుల‌కు ప్ర‌త్యేక స‌దుపాయాలు వంటివి క‌ల్పిస్తామ‌న్నారు. ఈ మేర‌కు ఒక్కొక‌టి కేసీఆర్ అమ‌లు చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీ కార్మికుల‌ను ఇక నుంచి ఉద్యోగులుగా పేర్కొనాల‌ని స్ప‌ష్టం చేస్తూ యాజ‌మాన్యం ఆదేశాలు జారీచేసింది. తాజా ప్ర‌క‌ట‌న‌తో, త‌మ‌తో జ‌రిగిన స‌మావేశంలో ఇచ్చిన హామీల‌ను సీఎం నెర‌వేరుస్తున్నార‌ని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఖుష్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: