ఏపీ రాజధానిని అమరావతి నుంచి మార్చే ఆలోచన లేదంటూ.. శాసన మండలిలో కొద్ది రోజుల క్రితం టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాట అన్న మర్నాడే.. బొత్స యూటర్న్ తీసుకున్నారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక తర్వాతే రాజధానిపై స్పష్టత వస్తుందన్నారు. తాజాగా ఆయన అమరావతిపై అదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజధాని సహా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధి కోసం జీఎన్ రావు కమిటీ వేశామన్నారు. ఆ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

సోమవారం శాసనమండలిలో మాట్లాడిన బొత్స.. రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలోనే పీవోటి యాక్ట్, అసైన్డ్ భూముల చట్టాన్ని టీడీపీ సర్కారు అతిక్రమించిందన్నారు. చట్టం ప్రకారం అసైన్డ్ భూములు కొనుగోలు చేయొద్దు. కానీ రాజధాని ముసుగులో అసైన్డ్ భూముల కొనుగోళ్లు జరిగాయన్నారు.

అసైన్డ్ భూముల కొనుగోళ్లపై విచారణ జరుపుతున్నామన్న బొత్స.. అసైన్డ్ భూములను కొనుగోళ్లు చేసిన వారి జాబితాను మంగళవారం ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడి కోసం సీఆర్డీఏ పరిధిని పెంచారని బొత్స ఆరోపించారు. ఎకరం లక్ష‌ రూపాయల చొప్పున ఆయనకు 498 ఎకరాలను ధారదత్తం చేశారన్నారు. అసైన్డ్ భూముల కొనుగోళ్లను రద్దు చేస్తూ.. ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

‘‘విజయవాడ-గుంటూరు నగరాల మధ్య సారవంతమైన భూములు ఉన్నాయని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనువైంది కాదని స్పష్టం చేసింది. నేల స్వభావం కారణంగా ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొందన్నారు. కానీ చంద్రబాబు ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేశారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం 102 అడుగుల లోతులోకి పిల్లర్లను భూమిలోకి దింపార’’ని బొత్స తెలిపారు. పునాదులను లోతుగా తవ్వడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: