దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో పోలీసులు చార్జిషీట్ ను వేసేందుకు సిద్ధం అవుతున్నారు. దిశ హత్య కేసును విచారించడానికి తెలంగాణ హై కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది అయితే విచారణకు ముందే నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం వల్ల ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండదని తెలుస్తోంది. పోలీసులు దిశ కేసులో చార్జీ షీట్ ను షాద్నగర్ కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

 

దర్యాప్తును వేగంగా పూర్తి చేసిన సైబరాబాద్ పోలీసులు, దిశ హత్యాచారం కేసులో ప్రతీ సాక్షం సేకరించారు. ఇక చార్జీ షీట్లో 56 మంది సాక్షులను చేర్చినట్లుగా తెలుస్తోంది. అత్యంత పాశవిక ఘటనకు పాల్పడ్డ నిందితులు, వేరే రాష్ట్రాల్లో ఇదే తరహా ఘటనల్లో నిందితుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ తరహా ఘటనల్లో సేకరించిన ఫింగర్ ప్రింట్ మరియు ఇతర సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చార్జిషీట్ లో పేర్కొన్నట్లు సమాచారం. నిందితులకు మొదటి నుంచి నేర ప్రవృత్తి ఉందని తెలిపినట్లు సమాచారం.

 

పోలీసులకు దిశ హత్య కేసులో చార్జిషీట్ నమోదుపై గందరగోళం నెలకొంది. హత్య కేసులో నిందితులు ఇప్పటికే మరణించడంతో చార్జిషీట్ వేయాల్సిన అవసరం లేదని కొందరు సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చార్జిషీట్ కి బదులుగా పోలీసులు ఒక రిపోర్టును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ రిపోర్టులో దిశ హత్యాచారానికి సంబంధించిన వివరాలతో పాటుగా, నిందితుల కరడుగట్టిన నేర చరిత్ర గురించి పేర్కొన్నట్లు సమాచారం. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులు జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ రిపోర్టులో పోలీసులు వెల్లడించనున్న విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పక్కాగా అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ నెలాఖరు లోపు రిపోర్టును కోర్టుకు అందించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: