మనుషులు అన్నాక తప్పులు చేస్తాం అది సర్వసాధారణం ఇందుకు రాజకీయ నాయకులు కూడా అతీతం కాదు. నిన్న (డిసెంబర్ 16) జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేత రోజా నోట జారిన ఒక మాట అందరినీ నవ్వించింది. మద్యపాన నిషేధంపై నిన్న అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. అధికార పక్షం తరపున ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ నేత రోజా మాట్లాడారు.

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మద్యపాన నిషేధం అమలు చేస్తానని మాట తప్పారు. గత ప్రభుత్వంలో మద్యం ఏరులై పారింది. మద్యం వల్ల ఎంతో మంది స్త్రీలు రోడ్డున పడ్డారు అంటూ రోజా చెప్పుకొచ్చారు. ఆ తరువాత తన ప్రసంగం కొనసాగిస్తూ "చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవు ఎందుకంటే చంద్రబాబు, కరువు ఇద్దరూ కవల పిల్లలు, గత ఐదు ఏళ్లలో కృష్ణ నదిలో వరద నీరు ప్రవహించలేదు కానీ మద్యం ఏరులై పారింది. ఈ విషయంపై మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు సభలో లేరు పారిపోయారు" అంటూ పప్పులో కాలేశారు రోజా. వెంటనే తప్పు తెలుసుకున్న రోజా "సారీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పారిపోయారు" అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.

 

తమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దశల వారీగా మద్యపాన నిషేధం చేసుకుంటూ వెళ్తున్నారని రోజా చెప్పారు. తాము మధ్యపాన నిషేధం తీసుకువస్తాం అంటే రాష్ట్రానికి ఆదాయం ఉండదని, సంక్షేమ పథకాలకు డబ్బులు ఎలా తెస్తారని, మద్యపాన నిషేధం అంటే రాష్ట్రంలో పురుషుల ఓట్లు పడవని ఎన్నెన్నో అన్నారని అయినా జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారని రోజా పేర్కొన్నారు. మద్యపాన నిషేధం వల్ల రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు జగన్ కు కృతజ్ఞతలు చెప్తున్నారని రోజా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: